కబ్రా ఏనుగు డ్రోన్ దృశ్యాలు
* పట్టుకోవడం అటవీశాఖకు సవాల్!
* గుంపు నాయకుడితో పోరాడి ఆధిపత్యం..
* థర్మల్ డ్రోన్‌లో దృశ్యాలు..
* రెండు కుంకీ ఏనుగులతో పట్టుకునేందుకు కొత్త ఆపరేషన్
ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్ :
ఛత్తీస్‌గఢ్‌లో వరుస ప్రాణాంతక దాడులకు కారణమైందని భావిస్తున్న ‘కబ్రా’ (Kabra Elephant) అనే దంతాల ఏనుగు పట్టుబడకుండా అటవీశాఖ అధికారులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఒంటరిగా సంచరించిన ఈ ఏనుగు.. తాజాగా 17 ఏనుగుల గుంపులో చేరింది.
అంతేకాదు, ఆ గుంపులోని ఆధిపత్య మగ ఏనుగుతో పోరాడి దానిని తరిమికొట్టినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 18 ఏనుగుల గుంపులో కలిసిపోయిన కబ్రాను గుర్తించి పట్టుకోవడం అధికారులకు కష్టంగా మారింది.
సుర్గుజా జిల్లా ఉదయ్‌పూర్ అటవీ ప్రాంతంలోని సయార్ అడవిలో రాత్రంతా ఈ ఏనుగుల మధ్య పోరు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. థర్మల్ డ్రోన్ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో కబ్రా (Kabra Elephant ) ఇతర ఏనుగులతో పోరాడుతూ వాటిని కిందపడేసినట్లు కనిపించింది. అనంతరం గుంపులోని పాత నాయకుడిని తరిమేసి ఆ గుంపులో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ గుంపు పోరాటం జరిగిన ప్రాంతానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని కుసువాముడా అడవికి వెళ్లింది.
* ఒంటరి ఏనుగు నుంచి 18 ఏనుగుల గుంపులోకి..
చెవులపై ప్రత్యేకమైన మచ్చలతో గుర్తించగలిగే కబ్రా.. గత ఆరు నెలల్లో సురజ్‌పూర్, బలరాంపూర్ జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు ప్రాణాంతక దాడులతో సంబంధం ఉన్న ఏనుగుగా గుర్తించారు. ఇప్పటివరకు ఒంటరిగా సంచరించడంతో అటవీ సిబ్బంది దాని కదలికలను సులభంగా గుర్తించి పర్యవేక్షించగలిగేవారు.
అయితే ఇప్పుడు మరో 17 ఏనుగులతో కలిసి తిరుగుతుండటంతో పరిస్థితి మారిపోయింది. గుంపులో కబ్రాను ప్రత్యేకంగా గుర్తించడం, ఇతర ఏనుగులకు ప్రమాదం కలగకుండా దానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం అధికారులకు సవాలుగా మారింది. అందుకే థర్మల్ డ్రోన్లతో గుంపు కదలికలను పరిశీలిస్తూ, అటవీ సిబ్బంది నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
* దుర్యోధన్, తిరత్ రంగంలోకి..
కబ్రాను పట్టుకునేందుకు అటవీశాఖ రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు దుర్యోధన్, తిరత్లను రంగంలోకి దించింది. వీటితో పాటు ప్రత్యేక వన్యప్రాణి వైద్యులు, ట్రాకింగ్ బృందాలు అవసరమైన పరికరాలు, మందులతో అక్కడే ఉన్నాయి. గతంలో కబ్రాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
దట్టమైన అడవిలో సురక్షితంగా దగ్గరకు వెళ్లి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం లభించలేదు. ఇప్పుడు కుంకీ ఏనుగుల సహాయంతో కబ్రాను గుంపు నుంచి వేరుచేసి, సురక్షితంగా పట్టుకునేందుకు మరోసారి ప్రయత్నించనున్నారు. పట్టుకున్న తర్వాత దానిని రామ్‌కోలా రెస్క్యూ కేంద్రానికి తరలించాలని అటవీశాఖ భావిస్తోంది.
* రాత్రంతా జాగారం.. 18 పాఠశాలలకు సెలవు..
మరోవైపు కబ్రా, ఏనుగుల గుంపు సంచారంతో ఉదయ్‌పూర్ పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగులు గ్రామాల వైపు వస్తాయేమోనన్న భయంతో గ్రామస్థులు రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. మంటలు వేసుకుని, గుంపులుగా ఉంటూ అప్రమత్తంగా గడుపుతున్నారు. ఏనుగుల సంచారం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ముందస్తు జాగ్రత్తగా జిర్మిటి, సయార్, మహేశ్‌పూర్ క్లస్టర్ల పరిధిలోని సుమారు 18 పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. సమీప అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. కబ్రాకు కేవలం రేడియో కాలర్ అమర్చడం కాకుండా, దానిని సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ప్రస్తుతం 18 ఏనుగుల గుంపు ఉదయ్‌పూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తుండటంతో.. మిగతా ఏనుగులకు ఇబ్బంది కలగకుండా కబ్రాను మాత్రమే వేరుచేసి పట్టుకోవడం అటవీశాఖకు కీలకంగా మారింది. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు పరిసర గ్రామాల్లో అప్రమత్తత కొనసాగనుంది.
Also Read : గడగడలాడిస్తున్న ‘కబ్రా కాన్’

Please tell us what is wrong. Your report will be sent to the website team.

