Revanth Reddy Fuel Hike
*ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలను పెంచడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని సీఎం స్పష్టం చేశారు.
*సామాన్యుడిపై భారం..
ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా, రవాణా రంగం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి దారితీస్తుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నేరుగా మధ్యతరగతి, పేద వర్గాల కుటుంబ బడ్జెట్ను అతలాకుతలం చేస్తూ, సామాన్యుడి నడ్డి విరిచే చర్య అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరువై భవిష్యత్తు అంధకారంగా మారుతోందని విమర్శించారు.
*ఇది ముమ్మాటికీ విశ్వాసఘాతుకమే….
ఎన్నికల ప్రక్రియ ముగిసిన కేవలం పది రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై మూడు రూపాయలకు పైగా అదనపు భారాన్ని మోపడం ప్రజలను నిలువునా వంచించడమేనని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఒకలా, ఎన్నికలు ముగిశాక మరోలా ప్రవర్తించడం ముమ్మాటికీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని (విశ్వాసఘాతుకం) దుయ్యబట్టారు.
*ఆర్థిక వృద్ధిపై ప్రశ్నల వర్షం..
అంతర్జాతీయంగా ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపిస్తూ ఇక్కడ ధరలు పెంచడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ఒకవైపు అంతర్జాతీయ పరిణామాల వల్లే ధరలు పెరుగుతున్నాయని చెప్తూనే, మరోవైపు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా ప్రచారం చేసుకుంటారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
