Government Land Protection
* ఆర్డీవోకు సిపిఎం వినతి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం షాపల్లిలో 135 సర్వే నెంబరులో 2-24 ఎకరాల ఇనాం భూమి కాజేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని అక్రమ పట్టా రద్దు రద్దుచేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ సిపిఎం బృందం మంగళవారం ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ జఫర్గడ్ మండలం షాపల్లిలో సర్వేనెంబర్ 135 విస్తీర్ణం 2-24 గుంటల ప్రభుత్వ (ఇనాం) భూమిని ఇదే గ్రామానికి చెందిన మాదిరెడ్డి రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని అతని పట్టాను రద్దు చేయాలని కోరారు. రెవెన్యూ డివిజనల్ పరిధిలో దేవాదాయ, ప్రభుత్వ, పంచరాయి, పోరంబోకు, చెరువు శికం తదితర వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి సర్వే నిర్వహించాలని, సరిహద్దులు నిర్ణయించి శాశ్వత సరిహద్దు రాళ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో అన్యాక్రాంత ప్రభుత్వ భూములపై గ్రామాల వారీగా సర్వే నిర్వహించి వివరాలను సేకరిస్తున్నామని, ఇప్పటికే పలు గ్రామాల నుంచి ఆక్రమణల వివరాలు పార్టీ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా కొలతలు వేయించి, హద్దులు నిర్ణయించి, ప్రభుత్వ ఆస్తి అని స్పష్టంగా తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే భూమిలేని నిరుపేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు లేని పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టకపోతే, సిపిఎం ఆధ్వర్యంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి, ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసి భూ పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలను సమీకరించి విస్తృత స్థాయి భూ పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మునిగేల రమేష్, మండల నాయకులు మంద మహేందర్, చిలుముల్ల భాస్కర్, ఓయూ రీసెర్చ్ స్కాలర్ తాళ్లపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
