
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థుల అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్-1, 2, 3 పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చించారు. తాము వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని.. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి ఒక హాల్ టికెట్ నంబరు, మెయిన్స్‌కి మరొక హాల్ టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా, ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపు 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడిరచలేదని, ఏ కారణం చేత ఆ 13 వేల మందిని ఇన్‌వ్యాలిడ్‌గా ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
…………………………………