Elon Musk Net Worth world record
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్, సోషల్ మీడియా రంగాలను ఒంటిచేత్తో శాసిస్తున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరో అరుదైన మైలురాయికి చేరువయ్యారు. ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని విధంగా సరికొత్త రికార్డును సృష్టించేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. ఒకవైపు ఆయన సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతుండగా, మరోవైపు భారతదేశంలో మారుతున్న సామాజిక, జనాభా పరిస్థితులపై మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
* జూన్ 12న ‘స్పేస్ ఎక్స్’ ఐపీఓ.. కోటి కోట్ల వైపు మస్క్..
బిలియనీర్ల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచే ఎలాన్ మస్క్, త్వరలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ (Trillionaire) గా అవతరించబోతున్నారు. మన భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే ఆయన ఆస్తి విలువ ఏకంగా కోటి కోట్ల రూపాయల మార్కును దాటనుంది. ఇందుకు జూన్ 12వ తేదీ (శుక్రవారం) ఒక కీలక వేదిక కానుంది. మస్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ ఎక్స్’ (SpaceX) ఇన్సిడెంట్ పబ్లిక్ ఆఫరింగ్‌కు రాబోతోంది. ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం.. ఈ ప్రక్రియ విజయవంతమైతే మస్క్ ఆస్తుల నికర విలువ సరికొత్త ఎత్తుకు చేరుకుంటుంది.
ఒకవేళ ఆయన తన సంపదను ప్రతిరోజూ, ప్రతి గంటకూ రూ. 9.5 కోట్ల చొప్పున నిరంతరాయంగా ఖర్చు చేస్తూ పోయినా.. ఆ మొత్తం కరిగిపోవడానికి 100 సంవత్సరాలకు పైగా సమయం పడుతుందంటే ఆయన సంపద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని మొత్తం నివాస, వాణిజ్య భవనాలన్నింటి విలువ కలిపినా కూడా మస్క్ సంపద కన్నా తక్కువగానే ఉండటం విశేషం.
* భారత్‌లో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. మస్క్ ఆందోళన..
వ్యాపార సామ్రాజ్యంలో రికార్డులు సృష్టిస్తున్న మస్క్, మరోవైపు సామాజిక అంశాలపై కూడా నిశితంగా స్పందిస్తుంటారు. తాజాగా భారతదేశంలో సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు పునరుత్పత్తి (రీప్లేస్మెంట్) స్థాయి కంటే కిందకు పడిపోయిందని, ముఖ్యంగా బాగా చదువుకున్న వర్గాల్లో ఈ రేటు ఎన్నో ఏళ్ల క్రితమే క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. ‘ఎఫ్ పోస్ట్’ అనే మీడియా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసిన గణాంకాలను ప్రస్తావిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
* ఐక్యరాజ్యసమితి నివేదిక ఏం చెబుతోంది అంటే..
ఇటీవల ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025’ నివేదిక ఆధారంగా వచ్చిన కథనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఒక దేశ జనాభా సమతుల్యంగా, స్థిరంగా ఉండాలంటే రీప్లేస్మెంట్ రేటు 2.1 గా ఉండాలి. కానీ ప్రస్తుతం భారతదేశంలో ఈ సగటు సంతానోత్పత్తి రేటు 1.9 కి పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇది మరీ దారుణంగా 1.2 గా నమోదైంది. ఇది యూరప్ దేశమైన ఫిన్లాండ్ కంటే కూడా తక్కువ కావడం గమనార్హం.
గత దశాబ్ద కాలంలో దేశ సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9 కి పడిపోవడం భవిష్యత్తుకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతీయ మహిళలు సగటున తక్కువ మంది పిల్లలను కంటున్నారని, దీనివల్ల భవిష్యత్తులో దేశ జనాభా వేగంగా తగ్గే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
