Democracy Protection Letter
* రాజ్యాంగ సంస్థల పరిరక్షణే లక్ష్యం
* మాజీ న్యాయమూర్తులు, ప్రముఖుల బహిరంగ లేఖ
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశంలోని కీలక రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న వరుస దాడులపై ఓట్ల చోరీ పేరిట జరుగుతున్న వివాదాన్ని 42 మంది మాజీ న్యాయమూర్తులు తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం, ఇతర రాజ్యాంగ సంస్థలపై సాగుతున్న ఈ ప్రచారం ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కొనసాగుతోందని వారు ఒక బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. ఈ మేరకు రిటైర్డ్ జడ్జీలు, ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా, ఈ కీలక తరుణంలో మౌనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన ఎన్నికల కమిషన్‌తో పాటు ఇతర ఉన్నత సంస్థలను కొందరు కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రపంచంలోనే అత్యున్నతమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిర పరిచేలా కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కే అయినప్పటికీ, వాటిని కించపరచడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో దొంగలు, తోలుబొమ్మలు అని పిలవడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారులను బెదిరిస్తూ, అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారని, ఓట్ల తొలగింపుపై న్యాయస్థానాలను ఆశ్రయించకుండా ప్రెస్ మీట్లలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓటమిపాలైనప్పుడే ఈవీఎంలపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమైనదని, అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిని సమర్థించిందని గుర్తుచేశారు.
ప్రజలలో ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవస్థీకృత ప్రచారాలు చేస్తున్నారని హెచ్చరిస్తూ.. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాలని కానీ వాటిని అప్రతిష్టపాలు చేయవద్దని, మీడియా ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాగానాలను ప్రచారం చేయరాదని, రాజ్యాంగ సంస్థలు మరింత పారదర్శకతతో నిలకడగా ఉండాలని, పౌరులు వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వ్యవహరించాలని ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను భారత రాజ్యాంగ సేవలో ఉన్న కన్సర్న్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఆందోళన చెందుతున్న భారతీయ పౌరులు) వారు విడుదల చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

