* గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక
* అర్హుల్లో ఎవరికి అన్యాయం జరగొద్దు..అనర్హులకు చోటు దక్కొద్దు
* పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష
ఆకేరున్యూస్, హైదరాబాద్: గతంలో హావిూ ఇచ్చిన విధంగా ఆదివారం నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సీఎం పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన లబ్దిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలను తెలంగాణ సర్కార్ లాంఛనంగా ప్రారంభించనుంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండలస్థాయి అధికారులను నియమించాలని తెలిపింది.
ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్దిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్చి 31 లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని..లబ్దిదారుల వెరిఫికేషన్ కోసం గ్రామసభలు నిర్వహించామని, ఇచ్చిన హావిూ మేరకు రేపటి నుంచి పథకాలు ప్రారంభిస్తామన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాట ప్రకారం నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
