BRS Targets Congress Government
ఆకేరు న్యూస్, హన్మకొండ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతాంగాన్ని విస్మరించి, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు, కక్షపూరిత రాజకీయాలకే పరిమితమైందని బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధ్వజమెత్తారు. గురువారం బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన మాట్లాడారు. నిన్న జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’ విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో వణుకు మొదలైందని, అందుకే అర్థం పర్థం లేని విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
* హామీలు అమలేవి ?
ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. “2022 మే 6న వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించింది. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ హామీలు ఏమయ్యాయి? రైతులకు ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా?” అని నిలదీశారు. కేవలం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై బూతు పురాణం విప్పడం సిగ్గుచేటన్నారు.
* రైతు బంధుపై విమర్శలు
కేసీఆర్ గారు రైతులు అడగకముందే ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అరకొరగా ఇస్తూ రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. కల్లాల వద్ద ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు అల్లాడుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాగరాజుకు దమ్ముంటే తనతో కలిసి కల్లాల దగ్గరకు రావాలని సవాల్ విసిరారు. మా నాయకుడు కేటీఆర్‌పై కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరుస్తామని ఘాటుగా హెచ్చరించారు.
* కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే
మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం నిర్మాణాలు చేయడం మానేసి, పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రాజెక్టులపై కనీస సమీక్ష లేదని, మంత్రుల మధ్య సమన్వయం లేక దేవాదుల పంప్ హౌస్ ప్రారంభోత్సవం కూడా చేతకావడం లేదని మండిపడ్డారు.
* చేతనైతే రాజీనామా చేయించి గెలవండి
మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో పదేళ్లలో సృష్టించిన ఆస్తులను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.
నైతికత ఉందా?: “మీ పాలనపై అంత నమ్మకం ఉంటే, మా పార్టీ నుండి మీ పార్టీలోకి చేరిన నాయకులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దాం రండి” అని సవాల్ విసిరారు. ఐటీ రంగంలో కేటీఆర్ చేసిన అభివృద్ధిని ప్రపంచం మొత్తం కీర్తిస్తుంటే, అజ్ఞానులైన కాంగ్రెస్ నేతలు టిల్లు అంటూ వెటకారం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి డిక్లరేషన్ అమలు చేసే వరకు ప్రజలను చైతన్య పరుస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, చింతల యాదగిరి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, నాయకులు తాళ్లపెల్లి జనార్ధన్ గౌడ్, పులి రజినీకాంత్, రామ్మూర్తి, నార్లగిరి రమేష్, నయీముద్దీన్, పానుగంటి శ్రీధర్, బండి రజినీకుమార్, రవీందర్ రావు, గండ్రకోట రాకేష్ యాదవ్, శ్రీకాంత్ చారి, మూటిక రాజు, కోటేశ్వర్ రావు, పులి విక్రమ్, వీపీ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
