Collector Chahat Bajpai
అకేరు న్యూస్, హనుమకొండ: ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి (Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు.
కాజీపేట మండలం మడికొండ గ్రామంలో క్రైస్తవ, ముస్లిం మతస్తుల స్మశాన వాటికల కోసం ప్రతిపాదించిన స్థలాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. స్థలం విస్తీర్ణం, రికార్డులు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
స్మశాన వాటికల కేటాయింపునకు సంబంధించి స్థల, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్డీఓ వెంకటేష్, కాజీపేట తహసీల్దార్ రాజును ఆదేశించారు.
ప్రభుత్వ భూములను గుర్తించి వాటి చుట్టూ హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను రికార్డులతో సరిపోల్చి, ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ రాజు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
