Say No to Drugs 2K Run Hanumakonda
* హనుమకొండలో మార్మోగిన ‘సే నో టు డ్రగ్స్’ నినాదం..
* జెండా ఊపి 2K రన్ ప్రారంభించిన అధికారులు
ఆకేరు న్యూస్, హనుమకొండ:
యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని పలువురు ప్రముఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU) హనుమకొండ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం “Break Free from Drugs – Build a Bright Future”, “Say No to Drugs” అనే ముఖ్య ఉద్దేశంతో భారీ 2కే రన్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ఈ రన్ కాళోజీ జంక్షన్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది.
* జెండా ఊపి ప్రారంభించిన ప్రముఖులు..
ఈ కార్యక్రమానికి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, వరంగల్ డీసీపీ ధారా కవిత ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం జర్నలిస్ట్ యూనియన్ ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ముందడుగు వేయాలని సూచించారు.
* ‘సే నో టు డ్రగ్స్’ ప్రతిజ్ఞ…
2కే రన్ ముగింపు వద్ద హాజరైన అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు సాధారణ ప్రజలతో కలిసి “సే నో టు డ్రగ్స్” ప్రతిజ్ఞ చేయించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకుంటూ తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
భారీగా తరలివచ్చిన
* విద్యార్థులు, జర్నలిస్టులు…
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ముద్రించిన ప్లకార్డులు చేతబూని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ నగరాన్ని చైతన్యపరిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) అప్పయ్య, డి ప్రొ (DPRO) అయూబ్ అలీ, కుడా (KUDA) మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో పాటు జర్నలిస్ట్ యూనియన్ బాధ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
