MLC Teenmar Mallann, Telangana Scholarship Dues
* స్కాలర్షిప్ విద్యార్థుల హక్కు.. ప్రభుత్వ భిక్ష కాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై తెలంగాణ శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్కాలర్షిప్ అనేది ప్రభుత్వం పేద విద్యార్థులకు వేసే భిక్ష కాదని, అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాల్సిన గురుతర బాధ్యత ఉందన్నారు. కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లు తట్టుకోలేక, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు తరగతి గదులు వదిలి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి రావడం పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఉన్నత విద్యే పేదరిక నిర్మూలనకు మార్గం..
శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని లేవనెత్తిన మల్లన్న.. విద్యార్థుల విద్యాభవిష్యత్తును కేవలం ఆర్థిక వ్యయంగా చూడకూడదని, ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన సామాజిక బాధ్యత అని హితవు పలికారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యే ఏకైక భరోసా అని, అలాంటి విద్యా వ్యవస్థను నిధుల కొరత నెపంతో కుదేలు చేయడం సరికాదన్నారు. ఒక పేద విద్యార్థి ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధిస్తే, ఆ ఒక్క కుటుంబమే కాకుండా సమాజం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతాయని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.
* ఫీజుల కోసం ఒత్తిళ్లు.. రోడ్లెక్కిన విద్యార్థి లోకం..
ప్రభుత్వం నుంచి రావాల్సిన వేలాది కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని, సర్టిఫికెట్లు ఆపుతామని యాజమాన్యాలు బెదిరిస్తుండటంతో పేద విద్యార్థులు ఎటు వెళ్లాలో తెలియక మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. “చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు తమ హక్కుల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి రావడం ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. తమ చదువుల కోసం విద్యార్థులు పాలకులను వేడుకునే పరిస్థితి రాకూడదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
* నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ధర్మం కాదు..
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే, శాసనమండలిలో ప్రజాప్రతినిధులు మౌనంగా, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం సభాగౌరవానికే మంచిది కాదని మల్లన్న ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల గొంతుకగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సభలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
* కాంట్రాక్టర్లకు నిధులున్నప్పుడు.. విద్యార్థులకు లేవా?
ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మల్లన్న.. బడా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు వందల కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేయడానికి నిధులుంటాయని, కానీ దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల స్కాలర్షిప్ల విషయానికి వచ్చేసరికి బడ్జెట్ కొరత నెపం చెప్పడం దారుణమని దుయ్యబట్టారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవాలని, అనుత్పాదక ఖర్చులను తగ్గించుకుని విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
* సమగ్ర అధ్యయనం.. స్పష్టమైన క్యాలెండర్ అవసరం..
ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. ఏయే వర్గానికి ఎంత మొత్తం బకాయి ఉందో సభ ముందు ఉంచి, వాటిని ఏ తేదీ నాటికి పూర్తిగా చెల్లిస్తారో స్పష్టమైన టైమ్ టేబుల్ లేదా క్యాలెండర్ ప్రకటించాలని కోరారు.
* పరిష్కారం కోసం విరామం లేని పోరాటం..
విద్యార్థులు, నిరుద్యోగులు, పేద వర్గాల హక్కుల కోసం మండలి వేదికగా తమ పోరాటం కొనసాగుతుందని మల్లన్న స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయకపోతే విద్యార్థుల తరఫున ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. “స్కాలర్షిప్ దానం కాదు.. అది విద్యార్థుల హక్కు” అనే నినాదంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మల్లన్న స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
