Indiramma Housing Scheme Telangana
ఆకేరు న్యూస్, కమలాపూర్:
మే నెలాఖరు నాటికి రెండో విడత ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.
శనివారం కమలాపూర్, శనిగరంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి వొడితల ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులు ఆయనకు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు రిబ్బన్ కట్ చేసి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహంలోకి ప్రవేశించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
* హామీ ఇచ్చిన 10 నెలల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి
శనిగరం గ్రామానికి చెందిన సారయ్య అనే రైతు పది నెలల క్రితం సొంత ఇల్లు లేక తన దీనావస్థను వివరించగా ప్రణవ్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ నెరవేరింది. పూర్తయిన ఇంటిని ప్రణవ్ స్వయంగా ప్రారంభించగా, పూరిగుడిసె నుండి పక్కా ఇంట్లోకి మారిన ఆ కుటుంబం మంగళహారతులతో ఆయనకు ఘనస్వాగతం పలికింది. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, వొడితల ప్రణవ్కు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో మంజూరు చేసిన 3,500 ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తికావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రణవ్ కొనియాడారు. ప్రభుత్వ సహకారంతో తమ గూడు కల నెరవేరడం పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
