MLA Venkata Ramana Reddy Nizamabad IT Hub
* ఐటీ రంగాన్ని జిల్లాలకూ విస్తరించాలి
* అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా గ్రామీణ, ఉమ్మడి జిల్లాలకు విస్తరించాలని కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభ వేదికగా నిజామాబాద్ ఐటీ హబ్ నిరుపయోగంగా మారడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
* నిజామాబాద్ ఐటీ హబ్ ఏమైంది..
గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో భూసేకరణ పూర్తి చేసి, నిజామాబాద్‌లో ఐటీ హబ్ భవనాన్ని నిర్మించినప్పటికీ ఇప్పటివరకు అక్కడ ఏ ఒక్క ప్రముఖ కంపెనీ కూడా కార్యకలాపాలు ప్రారంభించకపోవడం విచారకరమని కాటిపల్లి తెలిపారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించినా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదని స్పష్టం చేశారు.
* యువత వయోపరిమితి దాటుతోంది..
“ఐటీ హబ్ ఏర్పాటు చేసిన సమయంలో 25 ఏళ్లు ఉన్న యువకుల వయసు ఇప్పుడు 30 ఏళ్లకు చేరింది. మరో ఐదేళ్లు ఇలాగే ఆలస్యమైతే వారికి ఉద్యోగాలకు కావలసిన అర్హత లేదా వయోపరిమితి (ఏజ్ బార్) దాటిపోతుంది. ఇంజనీరింగ్, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన స్థానిక యువత కేవలం ఆ భవనాన్ని చూసి సంబరపడటమే తప్ప, ఉపాధి దక్కక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది” అని వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
* కంపెనీల రాకపై సమీక్షించాలి..
కాగ్నిజెంట్, మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు నిజామాబాద్‌కు ఎందుకు రావడం లేదో ప్రభుత్వం సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. కంపెనీలు అడిగిన దానికంటే అదనంగా మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్) ఇస్తేనే పెట్టుబడులు జిల్లాలకు వస్తాయని అభిప్రాయపడ్డారు.
* సమాన ప్రాతిపదికన జిల్లాల అభివృద్ధి
వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ఉమ్మడి జిల్లాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తే హైదరాబాద్‌పై ట్రాఫిక్, మౌలిక వసతుల భారం తగ్గడమే కాకుండా తెలంగాణ అంతటా సమాన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విద్యావంతుడని పేర్కొంటూ, ఆయన చొరవ తీసుకుని రాబోయే 6 నెలల నుండి ఏడాది కాలంలోగా నిజామాబాద్ ఐటీ హబ్‌లోకి కంపెనీలు వచ్చేలా చర్యలు చేపట్టి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఎమ్మెల్యే కాటిపల్లి కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
