* కిక్కిరిసిన సరూర్‌నగర్ స్టేడియం.. తోపులాట
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డ్రైవర్లు కావలెను అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hydra) ఇచ్చిన ప్రకటనకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు స్పందించారు. సరూర్‌నగర్ స్టేడియానికి భారీగా తరలివచ్చారు. వచ్చిన వారిని కంట్రోల్ చేయలేక, సర్దిచెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తీవ్రస్థాయిలో తోపులాట జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పోస్టులు ఎన్నంటే..
హైడ్రాలో పోస్టుల భర్తీకి ఆ సంస్థ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. హైడ్రాలో పని చేయడానికి 150 అసిస్టెంట్, డ్రైవర్ ఉద్యోగాల కోసం ప్రకటన జారీ చేసింది. ఈరోజు, రేపు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది. ఆ ప్రకటనను చూసిన వేలాది మంది నిరుద్యోగులు సరూర్‌నగర్ స్టేడియానికి తరలివచ్చారు. డ్రైవర్ పోస్ట్‌ల కోసం హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా యువత వచ్చారు. దీంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే స్టేడియానికి రావడం మొదలుపెట్టారు.
పోస్టులు 150.. వచ్చింది వేలాది మంది..
150 డ్రైవర్ పోస్టుల కోసం ప్రకటన ఇస్తే, ఇంత మంది రావడంతో హైడ్రా అధికారులు గందరగోళానికి గురయ్యారు. ఊహించిన రీతిలో వేలాది మంది పోటెత్తడంతో స్టేడియం మొత్తం నిరుద్యోగులతో కిక్కిరిసిపోవడంతో అదుపు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. టోకెన్లు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఉండాలని, టోకెన్లు లేని వారు బయటకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలో లేకపోవడంతో వచ్చిన వారిలో కొందరు అసహనం వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచి నీరు కూడా ఏర్పాటు లేదని నిర్వాహకుల తీరుపై ఆందోళనకు దిగారు. మరోవైపు ఎక్కువగా మాట్లాడేవారిని గుర్తిస్తామని అధికారులు హెచ్చరించడాన్ని కొందరు తప్పుబట్టారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
