Warangal Hyderabad E Bus
* మధ్యలోనే నిలిచిన ఈ-బస్సు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హనుమకొండ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన వరంగల్-2 (WGL-2) డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మార్గమధ్యలో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలోకి రాగానే బస్సులో అకస్మాత్తుగా లోపం తలెత్తడంతో వాహనం ముందుకు కదలలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్లు ప్రయాణికులను అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది.
* తీవ్ర అసహనంలో ప్రయాణికులు
ప్రమాదసమయానికి బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. రద్దీగా ఉండే హైదరాబాద్ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉష్ణోగ్రతలు, గాలి సరిగా ఆడకపోవడం, గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామనే ఆందోళనతో దాదాపు గంటకు పైగా ప్రయాణికులు రోడ్డుపైనే వేచి చూశారు. సిబ్బంది ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
* మరమ్మతు యత్నాలు విఫలం..
సమస్య తలెత్తిన వెంటనే డిపో సిబ్బంది బస్సు ముందు భాగంలో (ఇంజన్/ఎలక్ట్రికల్ ప్యానెల్) పరిశీలించి మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించారు. అయితే సాంకేతిక సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రయాణాన్ని కొనసాగించడం సాధ్యపడలేదు. దీంతో ప్రయాణికులు వెంటనే స్పందించి తమను సురక్షితంగా, సమయానికి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ బస్సులను లేదా ఇతర వాహన ఏర్పాట్లు చేయాలని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అధికారులను కోరారు.
* నిర్వహణపై ప్రశ్నలు..
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతున్నప్పటికీ, వాటి సరైన నిర్వహణ (Maintenance) లోపిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణానికి ముందే బస్సు కండిషన్ను పూర్తిగా తనిఖీ చేయాలని, ఇలాంటి సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
