KTR Warangal speech BRS
*కాకతీయుల గడ్డపై కేటీఆర్ గర్జన
*రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు
ఆకేరు న్యూస్, వరంగల్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వరంగల్ గడ్డ సాక్షిగా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) నిప్పులు చెరిగారు. “ఇది కాకతీయుల పౌరుషాల గడ్డ.. కాళోజీ ఆత్మగౌరవ అడ్డా.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ.. ఈ నేల మీద ఏ పని మొదలుపెట్టినా విజయమే” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
*రాహుల్ గాంధీది ‘ధోకా’.. రేవంత్‌ది ‘దగా’!
సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే మే 6న రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు గాలం వేశారని కేటీఆర్ గుర్తు చేశారు. “ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ గల్లీ కాంగ్రెస్ తొట్టి గ్యాంగ్‌ను వెంటేసుకొని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. రైతుల్ని ఉద్ధరిస్తాం, ఊడబొడుస్తాం అని నోటికొచ్చిన డైలాగులు కొట్టారు. కానీ నేడు ఆ డిక్లరేషన్ ఏమైంది? అందులోని 34 హామీలు ఎక్కడ పోయాయి?” అని ఆయన నిలదీశారు.
*’రైతు బంధు’ ఎగ్గొట్టిన ప్రభుత్వం!
కేసీఆర్ హయాంలో కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతుల ఇంటి వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేశామని, రైతు బంధును సక్రమంగా అందించామని కేటీఆర్ వివరించారు. “రేవంత్ రెడ్డి.. రైతు బంధు ఎందుకు బంద్ పెట్టావు? రైతన్నను నడిరోడ్డుపై నిలబెట్టిన ‘సంచులు మోసే సన్నాసి’వి నువ్వు” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను వంచిస్తోందని, చారణా రుణమాఫీ చేసి బారాణా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
*సభ సాక్షిగా కేటీఆర్ చేసిన 4 కీలక డిమాండ్లు ఇవే..
ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవహరించకపోతే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరిస్తూ, సభలో నాలుగు ప్రధాన డిమాండ్లను కేటీఆర్ తెరపైకి తెచ్చారు.
పరిహారం: కాంగ్రెస్ పాలనలో పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలి.
బోనస్: వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పంటకు ఎటువంటి షరతులు లేకుండా రూ. 500 బోనస్ తక్షణమే అమలు చేయాలి.
రుణమాఫీ: రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేసి, రైతులకు రుణ విముక్తి కల్పించాలి.
రైతు భీమా: రైతు బంధుతో పాటు నిలిచిపోయిన రైతు భీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి.
*కాళ్లు పట్టుకోకండి.. కాలర్ పట్టుకోండి!
రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మవిశ్వాసంతో పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. “రైతన్నలారా.. కాంగ్రెస్ నాయకుల కాళ్లు పట్టుకోకండి, వాళ్లకు దండం పెట్టకండి. కాళ్లు పట్టుకోవడం మానేసి వాళ్ల కాలర్ పట్టుకోండి. దండం పెట్టడం కాదు.. కాంగ్రెస్‌కు పిండం పెట్టండి. అప్పుడే తెలంగాణ రైతులకు మళ్ళీ కేసీఆర్ కాలం నాటి మంచి రోజులు వస్తాయి” అని కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
