KTR Hanumakonda challenge controversy
ఆకేరు న్యూస్, హనుమకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పద్ధతి మార్చుకోవాలని, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ తీరును విమర్శిస్తూ.. ఆయన మాటలు “దయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉన్నాయని ఎద్దేవా చేశారు.
బుధవారం వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన ‘రైతు సంగ్రామ సదస్సు’పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
* బీఆర్ఎస్ అంటేనే నకిలీ విత్తనాల ముఠా
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని నాయిని మండిపడ్డారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పాపం ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేయించి, బేడీలు వేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని గుర్తు చేశారు.ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ నేతలు లూటీ చేశారని ఆరోపించారు.
* సోనియా గాంధీ చుట్టూ తిరిగిన చరిత్ర మీది కాదా
కేటీఆర్ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని నాయిని విమర్శించారు. “రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీదా? ఒకప్పుడు మీ కుటుంబం మొత్తం పదవుల కోసం సోనియా గాంధీ చుట్టూ తిరిగిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు” అని గుర్తు చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవడం కాదని, చేతనైతే ఆధారాలతో సహా చర్చకు రావాలని సవాల్ విసిరారు.
* హనుమకొండ చౌరస్తాలో చర్చకు సిద్ధమా?
కేటీఆర్ చుట్టూ ఉన్నవారంతా దోపిడీదారులేనని ఆరోపిస్తూ, నాయిని రాజేందర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
”కేటీఆర్.. నీకు దమ్ముంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి హనుమకొండ చౌరస్తాకు రా.. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, నీ సొంత చెల్లెలు (కవిత) అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వు” అంటూ ఘాటుగా స్పందించారు.
రైతులను నట్టేట ముంచిన చరిత్ర కలిగిన బీఆర్ఎస్, ఇప్పుడు రైతుల కోసం పోరాడుతున్నామనడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ అబద్ధపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
