* రిజిష్ట్రార్ ఆఫీస్ దిగ్బంధనం
* 24 గంటలుగా పార్ట్ టైమ్ లెక్చరర్స్ ఆందోళన
* భోజనం – నిద్ర ఆఫీస్‌లోనే
* స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* సమస్యలు పరిష్కరిస్తానని హామి
ఆకేరు న్యూస్ – హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొన్నది. కేయూ రిజిష్ట్రార్ కార్యాలయాన్ని పార్ట్ టైం లెక్చరర్స్ దిగ్భంధనం చేశారు. రిజిష్ట్రార్ కార్యాలయంలోనే 24 గంటలకు పైగా ఆందోళన నిర్వహించారు. రిజిష్ట్రార్ చాంబర్లోనే భోజనం చేయడంతో పాటు ఏకంగా రాత్రంతా అక్కడే బస చేశారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
* అసలు సమస్య ఏంటి..?
కాకతీయ విశ్వవిద్యాలయంలో చాల ఏళ్ళుగా టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలు ఆగిపోయాయి. దీంతో కాంట్రాక్చువల్, పార్ట్ టైమ్ లెక్చరర్స్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్‌తో పాటు పార్ట్ టైమ్ లెక్చరర్స్ 120 మంది దాదాపు పదేళ్ళుగా పనిచేస్తున్నారు. పార్ట్ టైమ్ లెక్చరర్స్ కు మాత్రం ఆరు నెలలకు ఒకసారి జీతాలు వస్తుంటాయి. ఇదే విషయాన్ని గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రులను కలిసి తమ గోడు వెళ్ల బోసుకున్నారు. తప్పకుండా పరిష్కరిస్తామని చాలా సార్లు హామీ ఇచ్చినప్పటికీ పరిష్కారం మాత్రం కాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్ట్ టైమ్ లెక్చరర్స్ సమస్యను అప్పటి పీసీసీ అధ్యక్షుడు నేటీ సీఎం రేవంత్ రెడ్డి కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ద్వారా తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్ టైం లెక్చరర్ల సమస్య ఉందని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి తప్పకుండా పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
* అఫిడవిట్లు తెచ్చుకోండి ఆర్డర్స్ ఇస్తాం ..
పార్లమెంట్ ఎన్నికల హడావుడి ముగియడంతో కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రమేశ్‌ను కలిసి సమస్య పరిష్కరించమని కోరారు. వీసీ సానుకూలంగా స్పందించి మీరంతా అఫిడవిట్లు తెచ్చుకోండి ఆర్డర్లు ఇస్తామని హామి ఇచ్చారు. ఆనందంగా అందరూ అఫిడవిట్లు తెచ్చుకున్నారు. వైస్ చాన్స్‌లర్ మాత్రం కలవకుండా మొఖం చాటేశాడని పార్ట్ టైం లెక్చరర్స్ చెప్పారు. రిజిష్ట్రార్‌ను కలిసి సమస్య వివరించి మీరైనా పరిష్కరించాలని కోరారు. నిబంధనలకు విరుద్దం ఇదీ.. నేను చేయలేను అని చేతులెత్తేశారని పార్ట్ టైం లెక్చరర్స్ చెప్పారు. దీంతో గురువారం రిజిష్ట్రార్ చాంబర్లోనే అందరూ బైఠాయించారు. ఏకంగా రాత్రి భోజనాలు కూడా అదే చాంబర్లో చేశారు. అనంతరం రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అక్కడకు చేరుకుని సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
* వీసీ, రిజిష్ట్రార్లపై ఎమ్మెల్యే నాయిని ఆగ్రహం
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను మసక బారేటట్టు చేస్తున్నారు. 24 గంటలుగా లెక్చరర్స్ ఆందోళన నిర్వహిస్తుంటే పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని రిజిష్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డిని నిలదీశారు. వైస్ చాన్స్‌లర్ ఎందుకు ఇక్కడకు రాలేదని అడిగారు. వీసీ రమేశ్ పదవీ విరమణకు వారం రోజుల ముందు నుంచి పెద్ద సంఖ్యలో ఎందుకు ఆర్డర్స్ తీస్తున్నారని ప్రశ్నించారు. మూడేళ్ళు మౌనంగా ఉండి ఒక్కసారిగా బదీలీ ఉత్తర్వుల పరంపర ఎందుకు వస్తున్నాయని ఎమ్మెల్యే రిజిష్ట్రార్‌ను ప్రశ్నించారు. అంతేగాకుండా ఈ బదిలీ వెనుక పెద్ద ఎత్తున డబ్బుల చేతులు మారినట్లు మాకు సమాచారం ఉందన్నారు.. ఇందులో మీ వాటా ఎంత అని రిజిష్ట్రార్‌ను ప్రశ్నించారు. అలాంటి వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని రిజిష్ట్రార్ బదులిచ్చారు. వీసీ రమేశ్ పదవీ కాలంలో చేసిన అక్రమాలకు సంబందించి ప్రభుత్వం త్వరలోనే విచారణకు ఆదేశిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. వెంటనే పార్ట్ టైమ్ లెక్చరర్స్ సమస్యలు పరిష్కరించాలని రిజిష్ట్రార్ మల్లారెడ్డిని కోరారు.. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదరురైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
——————————–