Uday Krishna Reddy IPS Case
* కీలక ఆధారాలు అదృశ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై వేధింపులు, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసిన నేపథ్యంలో దర్యాప్తులో అత్యంత కీలకమైన సాక్ష్యాలు గల్లంతైనట్లు తేలడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
* రంగంలోకి CP సజ్జనార్..
కోర్టు అనుమతితో ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉంచి అధికారులు క్షుణ్ణంగా విచారించారు. కేసు తీవ్రతను బట్టి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V.C. సజ్జనార్ స్వయంగా స్టేషన్‌కు చేరుకుని విచారణ జరిపారు. దర్యాప్తుకు అత్యంత కీలకమైన ఐఫోన్ ఎక్కడ ఉందనే కోణంలో ప్రశ్నించగా, ఉదయ్ నుంచి స్పష్టమైన సమాధానం రానట్లు తెలిసింది. ఆ ఫోన్లో బాధితురాలితో జరిపిన సంభాషణలు, డిజిటల్ సాక్ష్యాలు ఉండే అవకాశం ఉండటంతో దర్యాప్తు బృందం దానికోసం గాలిస్తోంది.
* పొంతన లేని సమాధానాలు..
అంతేకాకుండా, గతంలో తాను రాసినట్లు ప్రచారంలో ఉన్న సూసైడ్ నోట్‌పై కూడా అధికారులు ఆరా తీశారు. మద్యం మైకంలో ఉన్న సమయంలో ఆ లేఖ రాశానని, అయితే అది ఇప్పుడు ఎక్కడ ఉందో తనకు గుర్తులేదని ఉదయ్ వెల్లడించినట్లు సమాచారం. మద్యం సేవించి స్పృహ తప్పిన స్థితిలో గతంలో ఎర్రగడ్డలోని ఓ స్నేహితుడి ఇంట్లో ఆయన కనిపించగా, స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విషయాన్ని పోలీసులు గుర్తుచేస్తున్నారు.
* సాక్ష్యాల ధ్వంసంపై పోలీసుల అనుమానం..
కేసు నమోదైనప్పటి నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉండేందుకు ప్రయత్నించిన ఉదయ్, డిజిటల్ ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారా లేదా ధ్వంసం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఐఫోన్ తుది లొకేషన్‌ను, సూసైడ్ నోట్ జాడను కనిపెట్టేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్, అత్తాపూర్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు.
రెండు రోజుల కస్టడీ గడువు పూర్తి కావడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆధారాలు దొరికే కొద్దీ మరిన్ని చట్టపరమైన సెక్షన్లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
