ఛత్తీస్‌గఢ్ బెమెతారా జిల్లాలో భారీ పేలుడు
* భవన శిథిలాల కింద మృతదేహాలు
* మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
* ఛత్తీస్‌గఢ్ బెమెతారా జిల్లాలో ఘటన
ఆకేరున్యూస్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్.. శనివారం ఉదయం భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏకంగా 17 మంది దుర్మరణం చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల తొలగింపు అనంతరం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాలకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులకు సాయం అందించే పనిలో నిమగ్నమయ్యారు.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
