Minister Ponguleti Indiramma Houses Warangal
ఆకేరు న్యూస్, వరంగల్: పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శాయంపేటలో నిర్మించిన 507 ఇందిరమ్మ రెండు పడకల (డబుల్ బెడ్రూమ్) ఇళ్లను లబ్ధిదారులకు మంగళవారం ఘనంగా పంపిణీ చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లక్కీ డ్రా విధానం ద్వారా అత్యంత పారదర్శకంగా ఇళ్లను కేటాయించారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాయంపేటలోని గృహ సముదాయాన్ని సందర్శించి, నిర్మాణాల నాణ్యతను పరిశీలించి లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు.
* పేదల కళ్లలో ఆనందం చూడాలన్న నా కల నెరవేరింది: ఎమ్మెల్యే నాయిని
సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఇల్లు లేని నిరాశ్రయ కుటుంబాల కళ్లలో ఆనందం చూడాలన్న నా ఎన్నో రోజుల కోరిక నేడు నెరవేరింది. శాయంపేటలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించిన స్థలంలోనే నేడు ఇళ్లను నిర్మించి, అర్హులకు అందించడం ద్వారా వారి హక్కులను కాపాడాం” అని అన్నారు.
భద్రకాళి మడ అభివృద్ధి భూ నిర్వాసితులకు, వరద బాధితులకు సైతం ఈ పథకం ద్వారా పరిహారంగా ఇళ్లను కేటాయించామని తెలిపారు.
నియోజకవర్గంలో 23 వేల మంది ఇళ్లు లేని వారు ఉన్నారని, అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిమిత ఇళ్లను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అత్యంత అర్హులకే కేటాయించామని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో స్థలాల కొరత పెద్ద సవాలుగా మారిందని, ఇప్పటికే మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం త్వరలోనే మూడో దశలో స్థలాలను సేకరించి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
* ఇళ్ల పంపిణీలో రాజకీయం లేదు, అర్హతే కొలమానం: మంత్రి పొంగులేటి
ముఖ్యఅతిథిగా విచ్చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ గృహ పథకంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, కేవలం పేదరికమే ప్రామాణికంగా ఇళ్లను కేటాయిస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో మగ్గుతున్న తమకు, రూపాయి ఖర్చు లేకుండా లక్కీ డ్రా ద్వారా సొంత గూడు లభించడం పట్ల లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు ఆనందబాష్పాలు రాల్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి మరియు ఎమ్మెల్యే నాయినికి లబ్ధిదారుల కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాయి.
