Kadiyam Srihari Development Works
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రైతు, మహిళా, పేద వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ కస్తూరిభా గాంధీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 లక్షల 50 వేలతో ఆర్.ఓ వాటర్ ప్లాంట్ 1 లక్షా 50 వేలతో హైమాస్ లైట్లను ప్రారంభించారు. 40 లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం పాఠశాలకు నేను ఇచ్చిన హామీలను నెరవేర్చనానని, ఉత్తమ ఫలితాలు సాధించి ఉపాధ్యాయులు, విద్యార్థులు మీ బాధ్యతలను నెరవేర్చాలని సూచించారు. అనంతరం నమిలిగొండలో 23 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి 1 కోటి రూపాయలతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతువేదికలో మండలనికి సంబందించిన 38 మందికి కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ లబ్ధిదారులకు 38 లక్షల 4 వేల 408 రూపాయల విలువగల చెక్కులను పంపిణి చేశారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం చిరస్మరణీయమని అన్నారు. సమాజ అభివృద్ధి కోసం విద్యా, సామజిక చైతన్యం, ఎంతో కీలకమని ఆయన చూపిన మార్గం ప్రతీ ఒక్కరూ ఆచరించదగిందని తెలిపారు. జయశంకర్ ఆకాంక్షించిన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, సామజిక తెలంగాణ సిద్దించే దిశగా అయన ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు పని చేసినప్పుడే ఆ మహానుభావునికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ రైతు, మహిళా, పేద వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కొంతమంది కళ్ళకు కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో 22 వేల 500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 13 వేల 500కోట్లతో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణి, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు వంటి అనేక పథకాలు పేద వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ఆగస్టు 15నుండి రాష్ట్రంలో కొత్త వితంతు పెన్షన్లు మంజూరు కాబోతున్నాయని వెల్లడించారు. నియోజకవర్గంలో 1500కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఏ గ్రామానికి వెళ్లిన ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, గ్రామ పంచాయితీ భవనాలు, వివో భవనాలు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, మహిళా భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక్క నమిలిగొండ గ్రామంలోనే కోటి 50లక్షల సిసి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, 30ఇందిరమ్మ ఇండ్లు, వివో భవనం, కమ్యూనిటీ హల్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు. గత 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపని చేశాడో ఇప్పుడు నేను ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నానో ప్రజలు గమనించాలని కోరారు. రాబోయే రోజుల్లో నమిలిగొండ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్ర సాగు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిన్ననే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో దేవాదుల రిజర్వాయర్ల ద్వారా ఆరుతడి పంటలకు సాగు నీరు అందించాలని కోరడం జరిగిందని మంత్రి వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగు నీరు విడుదల చేశామని, వారం రోజులలో ఘనపూర్, అశ్వరావుపల్లి, గండి రామారం రిజర్వాయర్ల ద్వారా కూడా సాగు నీరు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఎల్ నీనో ప్రభావంతో ఏర్పడిన కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని కొంతమంది సిగ్గు లేని సన్నాసులు మాట్లాడుతున్నారని తీవ్రం స్థాయిలో విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ వాయిస్ చైర్మన్ రాజమ్మ, దేవస్థానం చైర్మన్ నరసింహులు నాయకులు కిషన్ రాజు, రాజేష్ నాయక్, రజాక్ యాదవ్, బోర్ల శంకర్, పోశాల కృష్ణ, గట్టు రమేష్, శ్రీరాములు, వెంకన్న, నాగరాజు, అశోక్ పులి యాకయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
