MP Kadiyam Kavya Doctor Shortage
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్ అధికారులు, పారామెడికల్ సిబ్బంది తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నారని, ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్సభ వేదికగా బలంగా నిలదీశారు.
ఉత్తర తెలంగాణ ప్రజల ప్రాణనాడి అయిన వరంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల, మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రితో పాటు, కేంద్ర సహకారంతో నడుస్తున్న ఆసుపత్రుల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, మిగిలిన ఖాళీల వివరాలను స్పష్టం చేయాలని లోక్సభలో ప్రశ్నించారు. గత మూడేళ్లలో ఈ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన శాశ్వత, కాంట్రాక్టు నియామకాలు మరియు సంబంధిత చర్యల పురోగతిని వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు.
* కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం…
ఈ ప్రశ్నపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాధవ్ స్పందిస్తూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద రాష్ట్రాలు పంపే ప్రతిపాదనల ఆధారంగా సాంకేతిక, ఆర్థిక సహాయం మాత్రమే కేంద్రం అందిస్తుందని తెలిపారు.
వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి సంబంధించిన ఖాళీల వివరాలు ‘హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా (HDI)’ నివేదికలో అందుబాటులో ఉన్నాయని పేరొన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్యుల కొరత తీర్చేందుకు కాంట్రాక్ట్ నియామకాలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు (అలవెన్సులు), మరియు ‘యూ కోట్–వీ పే’ (You Quote-We Pay) వంటి ప్రత్యేక విధానాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
* కేంద్రం తీరుపై ఎంపీ అసహనం…
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆరోగ్యం అనేది రాష్ట్రాల అంశం” అని చెబుతూ కేంద్రం తన ప్రాథమిక బాధ్యత నుంచి తప్పించుకోవడం ఏమాత్రం తగదని వ్యాఖ్యానించారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కేవలం స్థానికులకే కాకుండా, ఉమ్మడి వరంగల్ సహా సమీప జిల్లాల పేద ప్రజలకు వైద్య సేవలు అందించే ఏకైక పెద్ద కేంద్రమని గుర్తుచేశారు. అక్కడ తీవ్ర నిపుణులైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరత ఉండడం వల్ల సాధారణ ప్రజలు నాణ్యమైన వైద్యానికి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు
* ఖాళీలు భర్తీ చేయాలి..
ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్య రంగాన్ని కేంద్రం తేలికగా తీసుకోకూడదని, బాధ్యతలను కేవలం రాష్ట్రాలపై నెట్టివేయకుండా ఎంజీఎం వంటి కీలక బోధనాసుపత్రులకు అదనపు నిధులు, సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక చొరవ తీసుకుని ఎంజీఎం ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఎంపీ డా. కడియం కావ్య డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
