Mulugu Congress Protest
* ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ – ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ నిరసన
ఆకేరు న్యూస్, ములుగు:
ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని, విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అలాంటి విద్యార్థులపై బలప్రయోగం చేయడం, వారిని అణిచివేసే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.
విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల గొంతును అణచివేయడం, ప్రశ్నించే వారిపై పోలీసు బలాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు.
దేశ యువత, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, నిరసనలను అణచివేయడం ద్వారా ప్రజల స్వరాన్ని ఎప్పటికీ మూయలేరని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
