MP Dr. Kadiyam Kavya Telangana CBM Development Demand
* తెలంగాణ బొగ్గు బెల్ట్‌లో సీబీఎం నిల్వల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
* లోక్‌సభలో రూల్–377 కింద అంశాన్ని ప్రస్తావించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
అకేరు న్యూస్ న్యూఢిల్లీ :తెలంగాణలోని సింగరేణి బొగ్గు క్షేత్రాలు, ములుగు–భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్న కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) నిల్వల అన్వేషణ, అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కోరారు. బుధవారం రూల్–377 కింద ప్రత్యేక అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ బొగ్గు బెల్ట్‌లో గణనీయమైన స్థాయిలో సీబీఎం నిల్వలు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయని ఎంపీ తెలిపారు. సీబీఎం పరిశుభ్రమైన ఇంధన వనరుగా దేశ ఇంధన భద్రతకు తోడ్పడటంతో పాటు విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భూగర్భ బొగ్గు గనుల్లో మీథేన్ వాయువు నిల్వలను తగ్గించడం ద్వారా గనుల భద్రత మెరుగుపడుతుందని, ప్రమాదాల అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్పారు.
సీబీఎం వనరుల శాస్త్రీయ అన్వేషణ, వాణిజ్యపరమైన వినియోగం ద్వారా తెలంగాణలోని బొగ్గు గని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. అయితే గణనీయమైన నిల్వలు ఉన్నప్పటికీ, వాటి అన్వేషణ, అభివృద్ధి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ బొగ్గు బెల్ట్‌లో సీబీఎం నిల్వలపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే తగిన విధానపరమైన మద్దతు, పెట్టుబడులతో సీబీఎం బ్లాకుల కేటాయింపు, అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించాలని సూచించారు. సీబీఎం వెలికితీత, వినియోగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
