PM Surya Ghar
PM Surya Ghar| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సేవా సేతు అవగాహన సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం శనివారం ముగిసింది. టీజీఎన్పీడీసీఎల్ డీఈ బి.సారయ్య ఆధ్వర్యంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి టీజీ రెడ్కో అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు, ఆమోదిత సోలార్ వెండర్లు హాజరయ్యారు.
భారీగా సోలార్ వినియోగం
ఈ సందర్భంగా డీఈ బి.సారయ్య మాట్లాడుతూ.. దేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగం వేగంగా పెరుగుతోందన్నారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 7.94 లక్షల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు కాగా, పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభమైన రెండేళ్లలోనే 50.06 లక్షల ఇళ్లకు సోలార్ ప్లాంట్లు చేరడం విశేషమన్నారు.
ప్రతి ఆరు రోజులకు సుమారు లక్ష మంది కొత్తగా ఈ పథకంలో చేరుతున్నారని తెలిపారు. గత జూలైలో ఒక్క నెలలోనే 5.06 లక్షల ఇళ్లలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రూ.78 వేల సబ్సిడీ
3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.1.45 లక్షల వరకు ఖర్చవుతుందని డీఈ తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. మిగిలిన రూ.67 వేల మొత్తానికి బ్యాంకులు 7 శాతం వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తున్నాయని వివరించారు.
నెలకు సుమారు రూ.3 వేల విద్యుత్ బిల్లు చెల్లించే కుటుంబాలకు సోలార్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా దాదాపు మూడేళ్లలో పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అధికారులు, ప్రజల పాల్గొనడం
కార్యక్రమంలో ఏడీఈలు పి.రణధీర్ రెడ్డి, బి.శ్రీధర్, ఏఈలు శ్వేత, రవీందర్, శంకర్, సురేష్, శివకుమార్, రాకేష్, కరుణాకర్, సబ్‌ఇంజినీర్లు మన్విత, సాధన, హరిత తదితరులు పాల్గొన్నారు. టీఆర్కేవీఎస్ జిల్లా నాయకులు అల్వాల మహేందర్ రెడ్డి, ఎల్ఐ యాదగిరితో పాటు లైన్మెన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఘన్పూర్, పాలకుర్తి ఉద్యోగులు, రైతులు, గృహిణులు, విద్యుత్ వినియోగదారులు హాజరయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
