తెలంగాణ హైకోర్టు (ఫైల్)
* ఆరు నెలల జైలు శిక్ష రద్దు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసు (Contempt of Court Case)లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. కలెక్టర్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
* 400 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌లోని మన్నె ముత్యాలమ్మ కుంట పరిధిలో సర్వే నంబర్లు 536, 537, 657, 658లో ఉన్న రెండు ప్లాట్లను నిషేధిత జాబితా (Prohibited Properties List) నుంచి తొలగించాలని కోరుతూ పి. శివలీల, మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. పిటిషనర్లు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అయితే, కోర్టు ఆదేశాలు అమలు కాలేదని పేర్కొంటూ పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ (Contempt Petition) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
* అప్పీలుపై హైకోర్టు విచారణ
సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డి హైకోర్టులో అప్పీలు (Appeal) దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఆదేశాల అమలుకు చర్యలు తీసుకున్నామని ధర్మాసనానికి వివరించారు. ఇందుకు సంబంధించిన కలెక్టర్ తహసీల్దార్‌కు రాసిన లేఖతో పాటు, ఆర్డీవో సంబంధిత కోర్టుకు పంపిన లేఖలను పరిశీలించాలని కోరారు.
* జైలు శిక్ష, జరిమానా రద్దు
వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. కలెక్టర్‌కు కోర్టు ధిక్కరణ కింద విధించిన ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను రద్దు చేసింది. సంబంధిత భూముల పరిధి మొత్తం 400 ఎకరాలు కావడంతో సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలుకు మరింత సమయం అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
Read Also : బంగారం ధరలు ఢమాల్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

