Thorrur Principal Transfer Students Protest
* తెరవెనుక ఎవరి పాత్ర?
* అధికారుల నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్న విద్యార్థులు!
ఆకేరు న్యూస్, తొర్రూర్ : తొర్రూరు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్ శంకర్ బదిలీ ఇప్పుడు వివాదానికి దారితీసింది.“శంకర్ సార్ మాకే కావాలి” అంటూ కొంతమంది విద్యార్థులు రోడ్డెక్కడం.. “ఎమ్మెల్యే రావాలి” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఒక అంశమైతే.. రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులు ప్రభుత్వ బదిలీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపైకి రావడం వెనుక అసలు ప్రేరణ ఏమిటన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. విద్యార్థులు స్వచ్ఛందంగానే ఆందోళనకు వచ్చారా? లేక పాఠశాలలోని పెద్దల ప్రోత్సాహం, ప్రభావం ఏమైనా ఉందా? అన్న అంశంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమే కాగా, మరోవైపు విద్యార్థులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధిని పిలవడం వెనుక ఉన్న పరిస్థితులపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భావోద్వేగాలను ముందుకు పెట్టి బదిలీ ఉత్తర్వులను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా? అన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది.
ప్రిన్సిపల్పై విద్యార్థులకు అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ అభిమానం రోడ్డు నిరసనగా మారేంత వరకు పరిస్థితి వెళ్లిందంటే.. పాఠశాల నిర్వహణలో విద్యార్థులపై ఏర్పడిన ప్రభావం ఎంత? వారి ఆందోళనకు దిశానిర్దేశం ఎవరిది? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులను రాజకీయ తరహా ఆందోళనల్లోకి తీసుకురావడం సరైన పద్ధతేనా? అన్న ప్రశ్నను అధికారులు పరిశీలించాలి.
మొత్తం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి.. విద్యార్థులు ఎందుకు రోడ్డెక్కారు? ఆందోళనకు ఎవరు పిలుపునిచ్చారు? ప్రిన్సిపల్ బదిలీపై ఇంతటి వ్యతిరేకతకు కారణమేంటి? అనే అంశాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. “ప్రిన్సిపల్ కోసం విద్యార్థుల ఆందోళనా.. లేక విద్యార్థుల పేరుతో బదిలీని అడ్డుకునే ప్రయత్నమా?” అనే ప్రశ్న ఇప్పుడు తొర్రూరులో హాట్ టాపిక్గా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
