Rajasthan Sandstorm
ఆకేరు న్యూస్, డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలో ప్రకృతి ఒక్కసారిగా రౌద్రరూపం దాల్చింది. శనివారం మధ్యాహ్నం తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఇసుక తుఫాన్ (Sandstorm) బీభత్సం సృష్టించింది.
ముఖ్యంగా చురు, బికనీర్, తారానగర్, మెహరి తదితర ప్రాంతాల్లో వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ఎడారి ప్రాంతం నుంచి దాదాపు 100 అడుగుల ఎత్తున ఇసుక మేఘాలు సునామీలా దూసుకొచ్చి నగరాలు, గ్రామాలను కమ్మేశాయి.
* చీకటిమయమైన గ్రామాలు…
ఈ భీకర ఇసుక తుఫాన్ ధాటికి పగటిపూటే రాత్రిని తలపించేలా ఆకాశం పూర్తిగా అంధకారమయమైంది. సుమారు అరగంట పాటు వీచిన బలమైన ఈదురుగాలులు, దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ఇళ్లు, వ్యవసాయ పొలాలు, రోడ్లన్నీ ఇసుక తివాచీ పరిచినట్లుగా మారిపోయాయి. దృశ్యమానత (Visibility) పూర్తిగా సున్నాకి పడిపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ భయానక ఇసుక తుఫానుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు మొబైల్ కెమెరాల్లో బంధించగా, ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
* ఆ తర్వాత కుండపోత వర్షం..
ఇసుక తుఫాన్ సృష్టించిన కాసేపటికే వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిపోతున్న రాజస్థాన్ ప్రజలకు ఈ వర్షం పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.
రాబోయే మరో ఐదు రోజుల పాటు రాజస్థాన్లోని బికనీర్, జైపూర్, అజ్మీర్, జోధ్పూర్ తదితర డివిజన్లలో గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వడగండ్ల వాన పడవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
