Sindhu Hospital Political Controversy
* బీఆర్ ఎస్, కాంగ్రెస్ , బీజేపీ ల వైఖరి పై చర్చ
ఆకేరు న్యూస్ , ప్రత్యేక ప్రతినిధి : పార్టీ ఏదైనా కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాలే ముఖ్యం . అందుకోసం రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి అందరు ఒక్కటవుతారు. విశాల ప్రజానికం ప్రయోజనాలకోసం మాత్రం రాజకీయాలకు పదనుపెడుతారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఏదైనా హెటిరో కంపెనీ యజమాని కళ్ళల్లో ఆనందం కోసమే తహతహలాడుతున్నాయి. సాక్షాత్తూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఆదివారం ప్రారంభించిన సింధూ హాస్పిటల్ కథ ఇదీ.. హైటెక్ సిటీ నడిబొడ్డున రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై వెలసిన ఈ క్యాన్సర్ ఆస్పత్రి వెనుక.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనే మూడు భిన్న ధృవాల అజ్ఞాత అవగాహన స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు భూమిని ధారపోస్తే, మరొకరు చట్టబద్ధత కల్పించారు, ఈ ఇద్దరిని తీవ్రంగా విమర్శించిన ఇంకొకరు ప్రారంభోత్సవ భాగస్వాములయ్యారు. ఈ త్రిముఖ రాజకీయ డ్రామా వెనుక అసలు కథానాయకుడు హెటిరో అధినేత. ఈ కథ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
* సింధు కోసం సంధి చేసుకుంటాం..
హెటిరో సంస్థ అధినేత బండి పార్థసారథి రెడ్డికి 2018లో ఖానామెట్‌లో అత్యంత ఖరీదైన 15 ఎకరాల భూమిని ఏడాదికి కేవలం రూ. 1.47 లక్షల స్వల్పమైన అద్దెకు కట్టబెట్టారని , దీనికి ప్రతిఫలంగా కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు, రాజ్యసభ సీటు దక్కాయన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఈ అంశంపై అప్పటి అధికార పార్టీ బీఆర్ ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి “జైలుకు పంపిస్తాం” అని తీవ్ర స్థాయిఓల గర్జించారు. అధికారంలోకి వచ్చాక జీఓ నంబర్ 37 ద్వారా అదే లీజును ఖరారు చేశారన్న విమర్శలు ఎదురొ్కంటున్నారు.. ఇక ఇదే అంశంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.
* బీజేపీ నాయకుల మౌనం..?
హెటిరో సంస్థకు అప్పనంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారని తీవ్రంగా స్పందించిన బీజేపీ నాయకులకు ఇపుడు ఏం చేయాలో తెలియని స్థితి నెలకొన్నది. నిన్నటి వరకు అన్యాయం . దారుణం, దోపడి అని అరిచిన సంస్థ కు సంబందించిన అస్పత్రి ప్రారంభించడానికి ఏకంగా ప్రధాన మంత్రే రావడంతో ఏం చేయాలో తెలియని దుస్థితి వారిది..
* చరిత్ర గొప్పదే..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హెటిరో డ్రగ్స్ పాత్ర అత్యంత కీలకం. క్విడ్ ప్రో కో (Quid Pro Quo) పద్ధతిలో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హెటిరోకు జడ్చర్ల సెజ్‌లో వందల ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా కేటాయించిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో పార్థసారథి రెడ్డి చార్జిషీటులో నిందితుడిగా కూడా ఉన్నారు. 2021 అక్టోబర్‌లో హెటిరో గ్రూప్‌పై జరిగిన ఆదాయపు పన్ను శాఖ (IT) దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పట్లో తనిఖీల్లో సుమారు రూ. 142 కోట్ల నగదు లభ్యమైంది. ముఖ్యంగా ఒక కార్యాలయంలోని ఇనుప బీరువాల్లో నోట్ల కట్టటు గుట్టలుగా కనిపించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు \రూ. 550 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ అప్పట్లో ప్రకటించింది.కోవిడ్ సమయంలో ప్రాణదాతగా భావించిన ‘రెమ్‌డెసివిర్’ ఇంజెక్షన్ల తయారీలో హెటిరో అగ్రస్థానంలో ఉంది. అయితే, పలు సందర్భాల్లో హెటిరో తయారు చేసిన మందులు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయని (Not of Standard Quality) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) హెచ్చరికలు జారీ చేసింది.
విశాఖపట్నం మరియు నక్కపల్లి పరిసరాల్లోని హెటిరో ఫార్మా యూనిట్ల నుండి వెలువడే కలుషిత జలాల వల్ల సముద్ర తీరం కలుషితమవుతోందని, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోందని దశాబ్దాలుగా పోరాటాలు సాగుతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, రాజకీయ పలుకుబడితో వాటిని అణచివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* కార్పోరేట్ల కోసం ఎంతకైనా.. !
ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఒక్కటవ్వని రాజకీయ పార్టీల నేతలు బడా పెట్టుబడి దారులు, కార్పోరేట్ కంపెనీల కోసం ఏ విదంగా ఒక్కటయ్యారో హెటిరో అనుబంద సంస్థ సింధు హాస్పటల్స్ వ్యవహారం చూస్తే అర్థమవుతోందని ప్రజలు అనుకుంటున్నారు..
————————
