Telangana SIR
Telangana SIR| ఆకేరు న్యూస్, హన్మకొండ: ఎస్ఐఆర్-2026 ప్రక్రియను ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్-2026తో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హన్మకొండ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇంటివద్దే నోటీసులు
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు తీసుకోవడం లేదా అవసరమైన పత్రాలు సమర్పించడం కోసం ఓటర్లను కార్యాలయాలకు పిలవకూడదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందించాలని, అవసరమైన పత్రాలను అక్కడే స్వీకరించాలని సూచించారు. అదేవిధంగా సాధారణ పరిస్థితుల్లో విచారణ కోసం కూడా ఓటర్లను కార్యాలయాలకు రప్పించవద్దని తెలిపారు. అత్యవసరంగా విచారణ అవసరమైతే ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించాలని అధికారులకు సూచించారు.
ఫారం-6పై డిక్లరేషన్
తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ తీసుకోవడం తప్పనిసరి అని సీఈఓ తెలిపారు. ఎస్ఐఆర్ అమలు చేయని రాష్ట్రాల్లో ఈ నిబంధన వర్తించకపోయినా, తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు డిక్లరేషన్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈఆర్ఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై ఫారం-6, ఫారం-7 దరఖాస్తులకు సంబంధించిన పెండింగ్, పరిష్కరించిన వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. పెండింగ్ నోటీసులపై కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
పార్టీలకు వివరాలు
ఫారం-6, పెండింగ్ నోటీసులు, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి దశలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
