Private School Fee Collection
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలో ‘సీబీఎస్ఈ’ పేరుతో ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజు వసూలుపై చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్వి మండల విద్యాశాఖ అధికారికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బిఆర్ఎస్వి) నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు నాణ్యమైన విద్య అందిస్తామని గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గొప్పగా ప్రచారం చేసుకుంటూ మోసం చేస్తున్నారని, సీబీఎస్ఈ కరికులమ్ అనుమతి లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులతో ఫీజుల నియంత్రణ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు తప్పుడు ప్రచారం చేస్తున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీబీఎస్ఈ కరికులమ్ పేరుతో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం అత్యంత ఆందోళనకరం అని విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నాయి అని ఆరోపించారు. నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పుకుంటూ బలవంతంగా వసూలు ఫీజులు వసూలు చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు ఇటువంటి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, ఫీజుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని , విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టి, ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా నాణ్యమైన విద్యను అందించాలి. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఓపెన్ మార్కెట్లో దొరికే విధంగా ఉంచాలని,సీబీఎస్ఈ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు.
ప్రవేట్ పాఠశాలలో విద్యార్థులకు టీసీల ఇవ్వడానికి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా వసూలు చేసే పాఠశాలలను తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవడంలో అసలు విద్యాశాఖ అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలల్లో అడిగే వారు ఉండరని ఫీజుల దోపిడీ కొనసాగుతుందని విద్యాశాఖ నిబంధనలను పట్టించుకోకుండా మా ఇష్టం ఉన్నట్లు మేము వసూలు చేస్తాం అంటూ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల అనిల్, గుండె రంజిత్, భూక్యా సురేష్ , భూక్యా శంకర్, సిహంద్రి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు
