Telangana DGP Office Incident
* చనిపోయినా నా కుటుంబాన్ని చూసుకుంటా
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్ (డీజీపీ కార్యాలయం) ప్రాంగణంలో గురువారం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వామి తన వద్ద ఉన్న సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అత్యున్నత రక్షణ వ్యవస్థ ఉన్న కార్యాలయంలోనే ఈ ఘటన జరగడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
* తెల్లవారుజామున తుపాకీ మోత..
లభించిన వివరాల ప్రకారం.. నేడు (గురువారం) తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ స్వామి కార్యాలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్/తుపాకీతో స్వయంగా కాల్చుకున్నారు. ఆకస్మికంగా భారీ శబ్దం రావడంతో అప్రమత్తమైన సహచర పోలీస్ సిబ్బంది వెంటనే వాష్‌రూమ్ వైపు పరుగులు తీశారు. లోపలికి వెళ్లి చూడగా, స్వామి రక్తాన్ని ఓడుతూ పడిపోయి ఉన్నారు. బుల్లెట్ తీవ్రంగా దిగబడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
* కన్నీరు పెట్టించే సూసైడ్ నోట్ స్వాధీనం..
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, ఫొరెన్సిక్ నిపుణులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్న సమయంలో అక్కడ ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ లేఖలో తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమను, తన మనోవేదనను స్వామి భావోద్వేగంగా రాసుకొచ్చారు.
“నా భార్య, పిల్లలు చాలా మంచివారు.. ఈ నిర్ణయంలో వారి తప్పేమీ లేదు, ఎవరూ వారిని తప్పుపట్టవద్దు. నేను చనిపోయి దయ్యంగా మారినా సరే.. నా భార్యాపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను” అని సదరు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వాక్యాలు అక్కడ ఉన్న వారిని తీవ్రంగా కలచివేశాయి.
* కేసు నమోదు – పలు కోణాల్లో దర్యాప్తు..
సంఘటనా స్థలంలో ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా లేక ఉద్యోగానికి సంబంధించిన మానసిక ఒత్తిడి కారణమా అనే పలు కోణాల్లో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌ను విశ్లేషిస్తూ, స్వామి కుటుంబ సభ్యులను, సహచర ఉద్యోగులను విచారించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
