Telangana Employees Health Cards
* 15లోగా హెల్త్ కార్డులు
* కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫ్రీ వైద్యం!
* సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ నెల 15వ తేదీలోగా హెల్త్ కార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ వైద్యం అందేలా ఒప్పందాలు కుదుర్చుకుంటామని వెల్లడించారు.
పీఆర్టీయూ నేతలతో సీఎం భేటీ
బుధవారం టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) రాష్ట్ర కార్యవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు తానే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
డీఏలు, పీఆర్సీపై కీలక హామీ
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు పీఆర్టీయూ నేతలు తెలిపారు. కొత్త పీఆర్సీ నివేదికను తెప్పించుకుని ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, వివిధ రకాల బిల్లుల చెల్లింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
2003 డీఎస్సీ టీచర్లకు ఓపీఎస్ అంశంపై స్పందన
2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని యూనియన్ నేతలు కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ ఎంపీ వేం నరేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలాగే సీపీఎస్ రద్దు అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 25 సవరణ, బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం పదోన్నతులు కల్పించాలని కోరారు.
గిరిజన పాఠశాలల ఉద్యోగులకు ఊరట
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నేతలు కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. వారం రోజుల్లోగా సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలని సీఎంవో ప్రత్యేక అధికారి వేముల శ్రీనివాసను అక్కడికక్కడే ఆదేశించారు.
ఐఈఆర్పీల సమస్యలపై సమీక్ష
సర్వశిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న ఐఈఆర్పీలకు కనీస పే స్కేల్ అమలు చేయడంతో పాటు, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. ఈ అంశాలను తదుపరి విద్యాశాఖ సమీక్ష సమావేశం అజెండాలో చేర్చాలని అధికారులను సీఎం ఆదేశించారు.
వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు
ఉపాధ్యాయుల బదిలీల అంశాన్ని కూడా పీఆర్టీయూ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ నేతలు మధుసూదన్ రెడ్డి, బిక్షంగౌడ్, సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పేరి వెంకట్ రెడ్డి, బి. జగన్మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ కార్డులు, పీఆర్సీ, డీఏలు, పెన్షన్ విధానం, పదోన్నతులు, బదిలీల అంశాలపై సీఎం ఇచ్చిన హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఈ నెల 15లోగా హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

