Konda Surekha Telangana Bonalu Celebrations
* ప్రభుత్వం అన్నిఏర్పాట్లూ చేసింది : కొండా సురేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఎక్కడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లూ చేశామని వెల్లడించారు. బోనాల పండుగ నేపథ్యంలో కొండా సురేఖ పాతబస్తీలోని సింహవాహని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాతబస్తీలో జరిగే సింహ వాహిని బోనాలకు తెలంగాణలోనే ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ ఆషాఢ మాసంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. ఎవరికీ ఇబ్బ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు.
* దాదాపు 5 లక్షల మంది..
లాల్‌దర్వాజా బోనాలకు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కాగా, అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు.
* అంబర్‌పేటలో మంత్రి సీతక్క..
అంబర్‌పేట మహంకాళి ఆలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. బోనాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని కోరుకున్నా అన్నారు. మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, తదితరులు ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
