Asifabad Podu Land Dispute
ఆకేరు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మమ్మల్ని అరెస్ట్ చేసినా, ఆఖరికి చంపేసినా సరే.. తరతరాలుగా నమ్ముకున్న భూములను వదులుకునే ప్రసక్తే లేదంటూ పోడు రైతులు తెగేసి చెప్పారు. జైనూర్ మండలంలో అటవీ శాఖ అధికారులకు, స్థానిక రైతులకు మధ్య జరిగిన ఈ ఘర్షణ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
* జేసీబీలను అడ్డుకున్న అన్నదాతలు…
జైనూర్ మండలంలోని పులస గ్రామ శివారులో ఉన్న అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు, వాటిని చదును చేసేందుకు అటవీ శాఖ అధికారులు జేసీబీ వాహనాలతో రంగంలోకి దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోడు రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అధికారుల చర్యలను తీవ్రంగా నిరసిస్తూ జేసీబీ వాహనాలకు అడ్డంగా నిలబడ్డారు. పనులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
* హక్కు పత్రాలున్నా వేధిస్తారా…
ఈ సందర్భంగా రైతులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా తాతముత్తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హక్కు పత్రాలు (పట్టాలు) సైతం మా దగ్గర ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు వచ్చి మా భూములను బలవంతంగా లాక్కుంటే మేము, మా పిల్లలు ఎలా బతకాలి?” అని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.
* రోడ్డున పడతామంటూ ఆవేదన..
తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు. అటవీ అధికారులు అక్రమంగా తమ పొలాల్లోకి వస్తున్నారని, ఈ భూములు పోతే ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా సరే సాగు భూములను వదిలేది లేదని స్పష్టం చేస్తూ అటవీ శాఖ సిబ్బందిని వెనక్కి పంపించి వేశారు. ప్రస్తుతానికి అధికారులు వెనుదిరిగినప్పటికీ, పులస గ్రామ శివారులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
