Tirupati Hotel 1000 Dollar Theft
ఆకేరు న్యూస్, డెస్క్: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని ఒక ప్రముఖ హోటల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం సింగపూర్ నుండి వచ్చిన ఒక ఎన్నారై (NRI) కుటుంబానికి చెందిన రూమ్ లాకర్లోని వెయ్యి డాలర్లు మాయమవ్వడం స్థానికంగా సంచలనంగా మారింది.
* వివరాల్లోకి వెళ్తే..
సింగపూర్‌కు చెందిన ఎన్నారై ఆర్ముగం తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు. నగరంలోని ‘మారస సరోవరం’ హోటల్లో రూమ్ నెంబర్ 1017లో వారు బస చేశారు. శుక్రవారం ఉదయం ఆర్ముగం కుటుంబం రూమ్ లాకర్లో తమ నగదును భద్రపరిచి, శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు.
అయితే, సాయంత్రం దర్శనం ముగించుకుని తిరిగి హోటల్ రూమ్‌కు వచ్చి చూడగా.. లాకర్లో ఉంచిన 1000 యూఎస్ డాలర్లు (1000$) మాయమైనట్లు గుర్తించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
* అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు – రంగంలోకి దిగిన పోలీసులు
బాధిత ఎన్నారై ఆర్ముగం వెంటనే ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అలిపిరి సబ్ ఇన్స్పెక్టర్ (SI) దుర్గాప్రసాద్ క్రైమ్ నెంబర్ 191/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ సిబ్బందిని, సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
* వారంలోనే రెండో చోరీ భయాందోళనలో భక్తులు..
ఇదే ‘మారస సరోవరం’ హోటల్లో చోరీ జరగడం ఇది మొదటిసారి కాదు. కేవలం వారం రోజుల క్రితమే హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారికి చెందిన రూ. 20 లక్షల నగదు ఇదే హోటల్లో చోరీకి గురైనట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఎన్నారై లాకర్ నుండి డాలర్లు మాయం కావడంతో హోటల్ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతపై ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
