Women Federation Petrol Bunk
అకేరు న్యూస్, డెస్క్: హనుమకొండ జిల్లా మడికొండలోని మహిళా ప్రాంగణంలో డీఆర్డీఏ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా సంఘాల సాధికారతకు తోడ్పాటుగా 1 కోటి 50 లక్షలతో నిర్మించనున్న జిల్లా మహిళ సమాఖ్య పెట్రోల్ బంక్ నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు కె.ఆర్ నాగరాజు, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాదని అన్నారు.మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలను లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా యజమానులుగా, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకునే స్థాయికి తీసుకెళ్తోందన్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు సాధించగలరని, ఇంటిని చక్కదిద్దే మహిళకు అవకాశం ఇస్తే వ్యాపారం, పరిశ్రమ, వ్యవసాయం, సేవా రంగం ఇలా అన్ని రంగాల్లోనూ తన ప్రతిభను చాటగలరని తెలిపారు.
అదే విధంగా నేడు మడికొండలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని, ఇకపై “మడికొండలో మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ ఉంది” అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
మహిళా సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ కార్యక్రమాలు, సోలార్ రంగం వంటి అనేక రంగాల్లో మహిళలు విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళలను నాయకత్వ స్థానాల్లో నిలబెట్టే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి ఆదాయ వనరులు పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించబడనున్న ఈ పెట్రోల్ బంక్ మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలపగలరు.
మహిళలు కుటుంబానికి, సమాజానికి వెన్నెముకలాంటివారని, వారు ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అన్నారు. అందుకే మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ, మహిళలు అన్ని రంగాల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, DEDO శ్రీనివాస్, BPCL MD సుధీర్, ముఖ్య నాయకులు, ఐకేపీ (IKP) రీజినల్ కోఆర్డినేటర్లు, సీసీలు మరియు స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
