Panchayat Raj Amendment
* చట్ట సవరణపై రేణుక హర్షం
ఆకేరు న్యూస్, డెస్క్: గ్రామ పంచాయతీలు, సర్పంచులకు పూర్తి అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్ట సవరణను మహిళా సర్పంచుల ఫోరం స్వాగతించింది. ఈ నిర్ణయంతో పల్లెల అభివృద్ధికి మరింత దారి సుగమం అవుతుందని ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటుపల్లి రేణుక అన్నారు.
ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను రేణుక కలిసి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీలకు పూర్తి అధికారాలు కల్పించడం గ్రామస్వరాజ్య స్ఫూర్తికి మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
స్థానిక సమస్యలను సర్పంచులు వేగంగా పరిష్కరించేందుకు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ఆలస్యం లేకుండా అమలు చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రేణుక తెలిపారు. ముఖ్యంగా మహిళా సర్పంచులకు ఇది మరింత ప్రోత్సాహాన్ని అందించి, స్థానిక పాలనలో వారి పాత్రను బలోపేతం చేస్తుందని అన్నారు.
సర్పంచుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని వారి గళానికి ప్రాధాన్యత ఇచ్చిన మంత్రి సీతక్కకు మహిళా సర్పంచుల ఫోరం తరఫున రేణుక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామ పంచాయతీలకు మరింత నిధులు కేటాయించడంతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో సర్పంచులకు మరింత స్వేచ్ఛ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
