*మిర్చి రైతుకు ఊరట…
*వరంగల్ మార్కెట్లో క్వింటా దేశీ మిర్చి ₹50,000!
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలోని ప్రముఖ వ్యవసాయ మార్కెట్లలో మిర్చి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. గత నాలుగేళ్లుగా సరైన ధర లేక ఆందోళనలో ఉన్న రైతులకు ఈ ఏడాది సీజన్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరంగల్ (ఏనుమాముల) మార్కెట్లో శుక్రవారం దేశీ (చపాట) మిర్చి క్వింటాకు ₹50,000 పలికి రికార్డు సృష్టించింది. 2021-22 సీజన్లో దేశీ మిర్చి ధర లక్ష రూపాయల వరకు వెళ్ళింది. అయితే ఆ తర్వాత ధరలు దారుణంగా పడిపోయి ₹30 వేల నుంచి ₹40 వేల మధ్యనే కొనసాగాయి. తాజా సీజన్లో ధరలు మళ్ళీ పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ రైతు తీసుకొచ్చిన 9 బస్తాల దేశీ మిర్చిని వ్యాపారులు పోటీపడి క్వింటా ₹50 వేలకు కొనుగోలు చేశారు.
*విదేశీ డిమాండ్‌తో పెరిగిన జోరు:
జియోట్యాగింగ్ ఉన్న దేశీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉండటంతో ఎగుమతిదారులు ఈ రకాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వరంగల్ మార్కెట్లో ఇతర రకాల ధరలు (గరిష్టంగా). తేజ: ₹18,700 , వండర్ హాట్: ₹36,000 , దీపిక: ₹30,000 , యూఎస్ 341: ₹22,100 , ఎల్లో మిర్చి: ₹23,000
*కేసముద్రం మార్కెట్లోనూ అదే జోరు:
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లోనూ మిర్చి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన ఈ-నామ్ (e-NAM) వేలంలో తేజ రకం మిర్చికి మంచి ధర లభించింది. గరిష్ట ధర: ₹18,789 , సగటు ధర: ₹18,489. నెల ప్రారంభంలో ₹16,000 స్థాయిలో ఉన్న సగటు ధర, ప్రస్తుతం ₹18,500 వరకు చేరింది. ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు వస్తున్న నిల్వలు మరియు అంతర్జాతీయ ఎగుమతుల ప్రభావంతోనే ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న రైతులకు కూడా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు లాభసాటిగా మారనున్నాయి.
