*తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుదాం
*ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి పదవి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేకి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ పాలక వర్గంతో దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ పాలక వర్గం చైర్మన్ గా పొట్లపల్లి శ్రీధర్ రావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నాపై నమ్మకంతో ఆలయ కమిటీ చైర్మన్ గా రెండవసారి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పొట్లపల్లి శ్రీధర్ రావు భక్తి భావంతోనే కాకుండా సేవా భావంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. శ్రీధర్ రావు స్వంత ఖర్చులతో ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లే అని అన్నారు. చిల్పూర్ ఆలయ అభివృద్ధికి 10 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ 10 కోట్ల నిధులను ముఖ్యమంత్రిని కలిసి రెండు నెలల్లో మంజూరు చేయిస్తానని తెలిపారు. ఏడాదిలో 10 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఆలయానికి ఎదురుగా ఇండ్లు నిర్మించుకున్న వాటికీ వేరే చోట ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులు నాటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామస్తులు సహకరిస్తేనే ఆలయ అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మి ప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, పాలక వర్గ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
