Gandi Ramaram lift irrigation deadline
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
గండి రామారం ఎత్తిపోతల పథకం పనులను జూన్ 30, 2026 నాటికి పూర్తి చేయాలి, వర్షాకాలం వరకు చెరువులు నింపి రైతులకు సాగు నీరు అందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదుల అధికారులను ఆదేశించారు.
హన్మకొండ చింతగట్టు క్యాంప్ లోని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో గండి రామారం ఎత్తిపోతల పథకం పనులపై నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సుధీర్ తో కలిసి అధికారులు, కాంట్రాక్టర్లు, చిల్పూర్, వేలేరు మండలాల సర్పంచులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గండి రామారం ఎత్తిపోతల పథకం పనులు ఎలా జరుగుతున్నాయి.? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా…? అనే వివరాలను అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులతో అదనపు చెరువులు ఏమైనా ఉన్నాయా..? వాటిని నింపేందుకు ఫీజుబులిటీ ఎంత వరకు ఉంది అనే సమాచారాన్ని తీసుకున్నారు. లిఫ్ట్ -1 కాలువ ఏ ఏ గ్రామాల నుండి ఏ ఏ చెరువులు నిండుతున్నాయో క్షేత్ర స్థాయిలో మ్యాప్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గండి రామారం ఎత్తిపోతల పథకం లోని లిఫ్ట్ -1 పనులను 30జూన్ 2026నాటికి పూర్తి చేసి వర్షాకాలం వరకు చెరువులు నింపి రైతులకు సాగు నీరు అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. లిఫ్ట్ -1 పైన వేలేరు, చిల్పూర్ మండలాల రైతులు నుండి డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు. లిఫ్ట్ -1 పనులు పూర్తి చేసేందుకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని కాంట్రాక్టర్లను అడిగారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో అదనపు చెరువులు, కుంటలు నింపేందుకు రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులకు వెంటనే ఎస్టిమేషన్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. అధికారులు వారానికి రెండు సార్లు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించాలని అధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తి చేయించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 30 జూన్ 2026 వరకు లిఫ్ట్ -1 పనులు పూర్తి కావాలని జులై మొదటి వారంలో ప్రారంభోత్సవం చేసుకోవాలని ఈ డెడ్ లైన్ లో మార్పు ఉండదని స్పష్టం చేశారు.ఈ సమీక్షలో నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ సుధీర్, ఎస్ఈ సీతారాం, డిఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు, చిల్పూర్, వేలేరు మండలాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
