new civil courts Elkathurthi Kataram
* జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి , జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం కేంద్రాల్లో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను ఏర్పాటు చేయడానికి అనుమతినిస్తూ లా డిపార్ట్మెంట్ G.O.Ms.No.35 ఉత్తర్వులను జారీ చేసింది.
బి పాపిరెడ్డి గవర్నమెంట్ సెక్రెటరీ పేరిట జారీ అయిన ఈ ఉత్తర్వుల ప్రకారం, కొత్త కోర్టులకు అవసరమైన సిబ్బంది నియామకం మరియు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సమన్వయంతో త్వరలోనే ప్రత్యేక ఆదేశాలు వెలువడనున్నాయి.
ఈ నూతన కోర్టుల ఏర్పాటు వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బంది తప్పనుంది. ఎల్కతుర్తిలో కోర్టు ఏర్పాటు వల్ల వేలేరు,వంగర, ముల్కనూర్ మండలాలకు చెందిన ప్రజలకు ఉపయోగకరంగా మారనుంది. అంతేకాకుండా సివిల్, క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది. న్యాయ పరిపాలనను వికేంద్రీకరించి, సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను న్యాయ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఆదేశాల కాపీలను ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రార్, డీజీపీ, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సెషన్స్ జడ్జిలకు అధికారికంగా పంపడం జరిగింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
