RCB Fans Police Warning
* ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బెంగళూరు పోలీసుల కీలక హెచ్చరిక..
ఆకేరు న్యూస్, డెస్క్:ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు బెంగళూరు సిటీ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఫైనల్ ఫలితం వచ్చిన తర్వాత నగరంలో ఎలాంటి పబ్లిక్ సెలబ్రేషన్స్, బైక్ ర్యాలీలు, రోడ్లపై సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ విడుదలైంది.
* గత ఏడాది ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు..
గత సీజన్లో ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
* రోడ్లపై సంబరాలకు పూర్తిగా నిషేధం
ఫైనల్ ఫలితం ప్రకటించిన తర్వాత రోడ్లపై లేదా పబ్లిక్ ప్రదేశాల్లో ఎలాంటి సంబరాలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే రోడ్లను బ్లాక్ చేయడం, గుంపులుగా చేరడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం నిషేధించినట్లు తెలిపారు. బైక్ ర్యాలీలు, ఓవర్ స్పీడింగ్, స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు మోగించడం, రోడ్లపై రేసింగ్ నిర్వహించడం వంటి చర్యలపై కూడా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* LED స్క్రీన్లపై కూడా ఆంక్షలు
రోడ్ల వైపు కనిపించేలా LED స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కూడా పోలీసులు నిషేధించారు. మాల్స్, పబ్స్, ఇతర వాణిజ్య సంస్థల బయట ప్రజలకు కనిపించే విధంగా లైవ్ స్క్రీనింగ్ నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, పుకార్లు, ఇతర జట్ల అభిమానులను అవమానించే కంటెంట్ షేర్ చేయొద్దని పోలీసులు సూచించారు.
* బాధ్యతగా సెలబ్రేట్ చేయాలని సూచన
క్రికెట్ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలని బెంగళూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
