Deputy CM Pawan Kalyan Vizag Steel Plant Accident
* డిప్యూటీ సీఎం పవన్ పరామర్శ
* త్రిసభ్య కమిటీ దర్యాప్తు
ఆకేరు న్యూస్, డెస్క్: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగారంలోని ఇనుము కరిగించే మొదటి విభాగంలో ఈ దుర్ఘటన సంభవించింది. కాగా మంగళవారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయడానికి ‘బొకారో స్టీల్ ప్లాంట్’ డైరెక్టర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య ఉన్నత స్థాయి కమిటీని నియమించిందని పేర్కొన్నారు. కమిటి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.
* ఒక్కసారిగా విస్ఫోటనం ..
కర్మాగారాల ప్రధాన అధికారి ప్రాథమిక పరిశీలన ప్రకారం.. ఇనుము కరిగించే మొదటి విభాగంలో సుమారు 1,600 డిగ్రీల అత్యధిక వేడి కలిగిన ద్రవరూప ఇనుమును ఒక భారీ పాత్రలో పెద్ద క్రేన్ సహాయంతో తరలిస్తున్నారు. కరిగిన ఇనుమును కిందకు పోసేందుకు తలుపులు తెరవడానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆ పాత్రలో ఒక్కసారిగా వాయువులు ఒత్తిడికి గురై భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడు ధాటికి వందలాది టన్నుల కరిగిన ఇనుము కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే భారీగా మంటలు ఎగసిపడి దట్టమైన పొగ కమ్మేయడంతో కార్మికులు బయటకు రాలేకపోయారు. ఇది పూర్తిగా సాంకేతిక లోపం వల్ల జరిగిన పారిశ్రామిక ప్రమాదమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరో వైపు కర్మాగారంలో సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
* గతంలోనూ ప్రమాదాలు…
విశాఖ ఉక్కు కర్మాగార చరిత్రలో గతంలోనూ పలుమార్లు ఇలాంటి భారీ ప్రమాదాలు జరిగాయి.
1మే నెల 2012 న | బ్లాస్ట్ ఫర్నెస్-3 వద్ద జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు.
*ఉక్కు కర్మాగార చరిత్రలోనే అత్యంత ఘోరమైన విపత్తు 13 జూన్ 2012 న జరిగింది . ఇనుము కరిగించే మూడో విభాగంలో కొత్త ఆక్సీజన్ ప్లాంట్ ను పరిశీలిస్తున్న సమయంలో ఒత్తిడి ఎక్కువై గొట్టాలు పేలిపోయాయి. సుమారు 3,000 డిగ్రీల వేడితో మంటలు వ్యాపించి కార్మికులు, అధికారులు సహా 19 మంది సజీవ దహనమయ్యారు.
* 2022 జనవరి 19న స్టీల్ మెల్టింగ్ షాప్-2 లోనే క్రేన్ ద్వారా ద్రవ ఉక్కును తరలిస్తుండగా వైర్ తెగి కింద పడింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. నలుగురు కార్మికులకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. |
* నరేంద్ర మోది దిగ్బ్రాంతి
ఈ విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పరిస్థితులను సమీక్షించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు విశాఖ వస్తున్నారు.
———————–
