Nandyal Highway Gold Theft
* రూ. 4.50 కోట్ల గోల్డ్ మాయం
ఆకేరు న్యూస్, డెస్క్: నంద్యాల జిల్లాలో సినిమా ఫక్కీలో జరిగిన ఓ భారీ చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టార్గెట్ చేసిన దుండగులు.. ఏకంగా రూ. 4.50 కోట్ల విలువైన 2.750 కిలోల బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అపహరించారు.
* స్కార్పియోతో ఛేజింగ్.. డాబా దగ్గర స్కెచ్..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బాధితుడు మోతీలాల్ అనంతపురం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారంతో ప్రయాణిస్తున్నాడు. అయితే, నిందితులు మోతీలాల్ కదలికలపై ముందే కన్నేసినట్లు తెలుస్తోంది.
అనంతపురం నుంచే ఒక స్కార్పియో వాహనంలో దొంగలు ఆ బస్సును వెంబడించారు. డోన్ జాతీయ రహదారిపై ఉన్న ‘భారత్ డాబా’ సమీపంలో బస్సు ఆగిన సమయంలో.. దుండగులు పక్కా ప్లాన్‌తో బస్సులోకి ప్రవేశించి బంగారం ఉన్న బ్యాగ్‌ను కొట్టేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
* జడ్చర్ల వెళ్లేసరికి గుండె గుభేల్..
బస్సు ప్రయాణం కొనసాగి జడ్చర్లకు చేరుకున్న తర్వాత మోతీలాల్ తన వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించుకున్నాడు. అందులో బంగారం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన బాధితుడు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
* రంగంలోకి దిగిన పోలీసులు..
బాధితుడి ఫిర్యాదు మేరకు డోన్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలమైన భారత్ డాబా పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.
బస్సును వెంబడించిన ఆ స్కార్పియో వాహనం నంబర్, అందులోని అనుమానితుల కదలికలను గుర్తించే పనిలో పడ్డారు.
ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని ఎలాంటి భద్రత లేకుండా బస్సులో తరలించడం, దొంగలకు ముందే సమాచారం ఉండటంపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
