PM SVANidhi Mahotsav 2026 Warangal
*స్వానిధి మహోత్సవ్–2026లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్
అకేరు న్యూస్ వరంగల్ :వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధి భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ (Chahat Bajpai) అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) , పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన స్వానిధి మహోత్సవ్–2026 కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించారు.
* ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
వీధి వ్యాపారుల ఆర్థిక ప్రగతి, స్వయం ఉపాధి బలోపేతం, కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుదలే స్వానిధి మహోత్సవ్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన వీధి వ్యాపారి సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు.
జీడబ్ల్యూఎంసీ పరిధిలో వీధి వ్యాపారులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీల సౌకర్యాలు, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది వీధి వ్యాపారులు పాల్గొన్నారని చెప్పారు.
పీఎం స్వనిధి (PM SVANidhi Scheme) పథకం కింద మొదటి, రెండో, మూడో విడత రుణాలను పెద్దఎత్తున అందిస్తున్నామని తెలిపారు.
పీఎం స్వానిధి పథకం అమలులో గ్రేటర్ వరంగల్ మూడు విడతలలో రుణాల మంజూరులో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించడం విశేష విజయమని పేర్కొన్నారు.
పథకంలో నమోదు కాని అర్హులైన వీధి వ్యాపారులకు ఈ మేళా ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయం, బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక సలహాలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక, డిజిటల్ సేవలను చేరువ చేయడం ద్వారా స్వయం ఉపాధిని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
స్వానిధి మహోత్సవ్‌లో (SVANidhi Mahotsav 2026) భాగంగా వీధి వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆయా పథకాల ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా వినియోగిస్తూ ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 48 వేల మంది స్ట్రీట్ వెండర్లు నమోదయ్యారని, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఎప్పటికప్పుడు నమోదు అవకాశం కల్పిస్తూ, జాబితాను నిరంతరం నవీకరించాలని అధికారులకు సూచించారు.
పీఎం స్వనిధి పథకం (PM SVANidhi Scheme) జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని, మొదటి విడతలో 30 వేల మందికి పైగా, రెండో విడతలో 20 వేల మందికి పైగా, మూడో విడతలో 10–11 వేల మందికి పైగా వీధి వ్యాపారులు రుణాలు పొందారని తెలిపారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల ద్వారా రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు.

కామన్ ఇంటరెస్ట్ గ్రూప్ (CIG) ల ఏర్పాటుతో వీధి వ్యాపారులు బ్యాంకుల నుంచి దశలవారీగా రూ.75 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉందని, ఈ విధానం వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
అంబెడ్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారులు, మహిళా సంఘాల వివిధ ప్రదర్శన స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించారు. వారు తయారు చేసి విక్రయిస్తున్న వస్తువులు, ఆహార పదార్థాలు, చిరుతిండి ఉత్పత్తులను పరిశీలించి, వాటి తయారీ విధానం, విక్రయాలు, ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఆహార పదార్థాలను రుచి చూసి వారి కృషిని అభినందించారు.
కార్యక్రమంలో వీధి వ్యాపారుల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా వీధి వ్యాపారులు పీఎం స్వానిధి పథకం ద్వారా పొందిన ఆర్థిక సహాయం తమ జీవనోపాధికి ఎలా దోహదపడిందో వివరించారు. ఈ పథకం ద్వారా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు ఆదాయం పెరిగిందని, కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తమ విజయగాథలను పంచుకున్నారు. ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో స్వయం ఉపాధిలో స్థిరపడగలిగామని వారు తెలిపారు.
అనంతరం రుణాలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులకు శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, ఉప కమిషనర్ సమ్మయ్య, ఎల్ డిఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డి ఎం సి రజిత రాణి, టి ఎం సి లు రమేష్ సంబంధిత అధికారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

