Vietnam Boat Accident Victims
ఆకేరు న్యూస్, డెస్క్: వియత్నాంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయ పర్యాటకుల మృతదేహాలు నేడు (సోమవారం) స్వదేశానికి చేరుకోనున్నాయి. వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానం (VN979) ద్వారా ఈ మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.
* అధికారిక సమాచారం ప్రకారం..
ఈ విమానం నేటి రాత్రి 9:35 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది.
* విమానాశ్రయంలో పటిష్ట ఏర్పాట్లు
మృతదేహాలు ముంబై చేరుకోనున్న నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్లియరెన్స్ ప్రక్రియ వేగంగా పూర్తయిన వెంటనే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మృతదేహాలను వారి సొంత రాష్ట్రాలకు, అక్కడి నుంచి బాధితుల కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.
* పర్యాటకంలో తీవ్ర విషాదం
కొద్ది రోజుల క్రితం వియత్నాంలో పర్యటించడానికి వెళ్లిన భారతీయులు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయులు జలసమాధి అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
* అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం..
ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అప్రమత్తమైంది. స్థానిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మృతదేహాల గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మృతదేహాలు స్వదేశానికి వస్తుండటంతో బాధితుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
