Tirumala
ఆకేరు న్యూస్, డెస్క్: కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద నిత్య పూజలు అందుకూంటున్న ఆంజనేయస్వామి విగ్రహం హఠాత్తుగా మాయమవ్వడం కలకలం రేపింది. అర్థరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు ఈ విగ్రహాన్ని అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
* భక్తుల తీవ్ర ఆందోళన..
ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సంచరించే ఘాట్ రోడ్డులో, నిత్య పూజలందుకునే పవిత్రమైన విగ్రహం మాయమవ్వడంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతా వ్యవస్థపై, నిఘా వైఫల్యంపై పలు అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పవిత్ర క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* రంగంలోకి దిగిన పోలీసులు – సీసీ టీవీల ఆధారంగా దర్యాప్తు..
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విగ్రహం చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘాట్ రోడ్డులోని సీసీటీవీ (CCTV) పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్థరాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన వాహనాలు, అనుమానితుల కదలికలపై నిశితంగా దృష్టి సారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
