Collector Sandeep kumar jha Promotes Dryland Crop Cultivation in jangaon
* ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి
* ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
– జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha)
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
వర్షాబావ పరిస్థితులను అధిగమించేందుకు రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
ఎల్నీనో కంటింజెన్సీ ప్రణాళికలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఆరుతడి పంటల సాగు, కూరగాయల విత్తనాల మేళాలో భాగంగా జిల్లాలోని చిల్పూర్ మండలం మల్కాపూర్ లోని రైతు వేదికలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

* ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ఆరుతడి పంటలను కూడా సాగు చేయాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
కంది, శనగ, పెసర వంటి పప్పుధాన్యాలతో పాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.
“ఆయిల్ పామ్” సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని అందించే పంట అని తెలిపారు.
ఈ పంట సాగుకు ప్రభుత్వం వివిధ రకాలుగా 4 సంవత్సరాల పాటు సబ్సిడీ అందిస్తోందని, అలాగే ఆయిల్ పామ్ మంజూరు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాల కల్పనను కూడా త్వరితగతిన చేపట్టనున్నట్లు వివరించారు.
రైతులకు పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం 75 శాతం వరకు ప్రోత్సాహక సహాయం అందిస్తోందని తెలిపారు. పంటలతో పాటు పశుపోషణను అనుసంధానం చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు.
కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ ఆవరణలో కంది పంటను సాగు చేస్తున్నామని పేర్కొంటూ, ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో విశ్వాసం పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సాగుకు సంబంధించిన ఏవైనా సందేహాలు, సాంకేతిక సూచనలు (లేదా) సమస్యలు ఉన్నట్లయితే వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులను సంప్రదించాలని సూచించారు. అదే విధంగా కలెక్టరేట్ లోని టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6605 (toll free number) కు ఫోన్ చేసి కూడా సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం, సలహాలు పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరుతడి పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న ప్రగతిశీల రైతులను కలెక్టర్ మోమెంటోలతో సత్కరించి, అభినందించారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాల సంచులను పంపిణీ చేసి, విత్తన మేళాను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులు సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి, ఉప సర్పంచుల పోరం అధ్యక్షులు పశుల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, కుమారస్వామి, రాకేష్, హరీష్, స్వరూప రాణి రైతులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
